Arvind Kejriwal: ఢిల్లీ జల్‌బోర్డు అక్రమాలపై ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

  • ఢిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణకు పలుమార్లు ఢిల్లీ సీఎం గైర్హాజరు
  • ఢిల్లీ జల్‌బోర్డు అక్రమాలపై విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు
  • ఈసారి కూడా డుమ్మా కొట్టిన కేజ్రీవాల్
  • సమన్లు చట్టవిరుద్ధమన్న ఆమ్ ఆద్మీ పార్టీ
Delhi CM Arvind Kejriwal skips ED summons in money laundering case linked to Delhi Jal Board

ఢిల్లీ జల్‌బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ ఎదుట హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. యథాప్రకారంగానే ఈ సమన్లను కూడా కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఈ సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చట్టవ్యతిరేకమని కొట్టిపడేసింది.

మనీలాండరింగ్ కింద కేజ్రీవాల్‌పై నమోదైన రెండో కేసు ఇది. ఇప్పటికే ఆయన ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులోనూ ఈడీ పలుమార్లు నోటీసులు జారీచేసినా ఢిల్లీ సీఎం పక్కనపెట్టారు. జల్‌బోర్డు అక్రమాలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈడీ గత నెలలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు, ఆప్ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీ జల్‌బోర్డు మాజీ సభ్యుడు, ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇళ్లపై దాడిచేసింది. ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అర్హత లేకున్నా రూ. 38 కోట్ల విలువైన ఢిల్లీ జల్‌బోర్డు కాంట్రాక్ట్‌ను అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.

More Telugu News