Encounter Specialist: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టునే టార్గెట్ చేసిన గొలుసు దొంగలు.. తర్వాత జరిగింది ఇదే!

Snatchers target encounter specialist cop in Delhi
  • ఈవినింగ్ వాక్ చేస్తున్న వినోద్ బడోలాపై దుండగుల దాడి
  • ముక్కుపై పిడిగుద్దులు కురిపించడంతో కిందపడిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్
  • చైన్ లాక్కుని పరారవుతున్న నిందితుడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు ఫోన్
  • గాయాన్ని లెక్క చేయక పరారైన మరో నిందితుడి ఆటకట్టించిన వైనం
  • గతంలో రాష్ట్రపతి నుంచి శౌర్య పురస్కారం అందుకున్న వినోద్
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన పోలీసు మెడలోని బంగారు గొలుసును కొట్టేసే ప్రయత్నం చేసిన దొంగలు ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ వినోద్ బడోలా నెహ్రూ పార్క్‌లో ఈవినింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు దుండగులు ఆయనపై దాడిచేశారు. 

వారిలో ఒకడు వినోద్ ముక్కుపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆయన కిందపడిపోయారు. ముక్కు నుంచి రక్తం కారుతుండడంతో విలవిల్లాడిపోయాడు. ఇంకో దుండగుడు కిందపడిన వినోద్ మెడలోని చైన్ లాక్కున్నారు. అప్పుడే ఊహించని ఘటన జరిగింది. 

ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నా లెక్కచేయని వినోద్ లేచి పారిపోతున్న నిందితుల్లో ఒకడైన గౌరవ్‌ను పట్టుకోగలిగారు. అప్పటికే అతడి చేతిలో తుపాకి ఉన్నప్పటికీ కదలకుండా గట్టిగా పట్టుకుని పోలీసులకు ఫోన్ చేశారు. ఇంకో దుండగుడు పరారయ్యాడు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుని గౌరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, స్థానిక పోలీసుల సాయంతో మరో నిందితుడు పవన్‌ను కూడా వినోద్ వెంటాడి పట్టుకున్నారు. నిందితులను విచారించగా వారిపై పలు కేసులు ఉన్నట్టు తేలింది. కాగా, రక్తమోడుతున్నా చలించక నిందితులను పట్టుకున్న వినోద్‌కు ఘన చరిత్రే ఉంది. రాష్ట్రపతి నుంచి  ఆయన శౌర్య పురస్కారం అందుకున్నారు. పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
Encounter Specialist
New Delhi
Chain Snatchers
Crime News

More Telugu News