JandK Formula-4: జమ్మూకశ్మీర్‌లో మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్.. ప్రధాని మోదీ హర్షం

  • శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు వెంబడి ఫార్ములా-4 ఈవెంట్
  • కార్లతో డ్రైవర్ల సాహసకృత్యాలు చూసి ఆశ్చర్యపోయిన యువత
  • జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి ఫార్ములా ఈవెంట్‌పై ప్రధాని మోదీ హర్షం
  • మోటార్‌స్పోర్ట్స్ రంగానికి సంబంధించి భారత్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని ట్వీట్
JK Srinagar hosts first ever Formula 4 race to promote tourism PM Modi says very heartening to see

జమ్మూకశ్మీర్‌లో ఆదివారం మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్ జరిగింది. శ్రీనగర్ వేదికగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చూసి తన మనసు ఆనందంతో నిండిపోయిందన్నారు. మోటార్‌స్పోర్ట్ రంగానికి భారత్‌లో అనేక అవశకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి శ్రీనగర్ ముందు వరుసలో నిలిచిందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. 

శ్రీనగర్‌లోని దాల్ సరస్సు తీరం వెంబడి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకూ 1.7 కిలోమీటర్ల ట్రాక్‌పై ఫార్ములా-4 కార్ల ప్రదర్శనను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సాగిన కార్యక్రమంలో దూసుకుపోయిన కార్లను వీక్షించి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. కార్లతో ఫార్ములా-4 డ్రైవర్ల విన్యాసాలు అనేక మందిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం యువత ఫార్ములా-4 డ్రైవర్లతో మాట్లాడారు. రేసింగ్‌కు సంబంధించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ రంగంపై ఆసక్తి పెంచేలా ఫార్ములా డ్రైవర్లు యువతతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

ఫార్ములా-4 ఈవెంట్ కేవలం కార్ల రేసింగ్, పోటీకి సంబంధించినది మాత్రమే కాదని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఐక్యతకు, ప్రతికూలతలు తట్టుకునే సామర్థ్యానికి చిహ్నమని అన్నారు. ఫార్ములా-4 డ్రైవర్ల స్ఫూర్తితో మరింత మంది కశ్మీరీ యువత రేసింగ్ రంగంలో కాలుపెడతారని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. 

తొలిసారిగా జరుగుతున్న ఈ ఈవెంట్‌కు అక్కడి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫార్ములా-4కు అనుకూలంగా ట్రాక్‌ను తీర్చిదిద్దారు. ట్రాక్ వెంబడి పలు చోట్ల వైద్య బృందాలను, అగ్నిమాపక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం మొత్తాన్ని డ్రోన్లతో పర్యవేక్షించారు.

More Telugu News