YS Sharmila: పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా?: ప్రధాని మోదీపై షర్మిల ఫైర్

YS Sharmila strongly reacts on PM Modi remarks
  • చిలకలూరిపేట సభలో కాంగ్రెస్, వైసీపీపై మోదీ విమర్శలు
  • వైసీపీ, కాంగ్రెస్ ఒకటేనని వ్యాఖ్యలు
  • తెరవెనుక స్నేహం నడిపింది ఎవరంటూ షర్మిల ఆగ్రహం
ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చిలకలూరిపేటలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. 

దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అటు జగన్ ను, ఇటు బాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని షర్మిల విమర్శించారు. పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా, పైగా వారికి అడ్డగోలు సహాయసహకారాలు అందించింది ఎవరు? ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో?." అంటూ షర్మిల నిలదీశారు. 

"పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ పార్టీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చింది. మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇదీ... వీరి స్నేహం, విడదీయరాని బంధం! హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అన్న కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయి. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ పై పసలేని దాడులు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?" అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
YS Sharmila
Narendra Modi
Jagan
Congress
YSRCP
Chilakaluripet
Andhra Pradesh

More Telugu News