Election Code: ఏపీలో ఎన్నికల కోడ్ అమలు... హోర్డింగులపై కొరడా ఝళిపించిన ఎలక్షన్ కమిషన్

  • నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
  • వెంటనే కోడ్ అమలు
  • ఎన్నికల అధికారులతో ముఖేశ్ కుమార్ మీనా టెలీకాన్ఫరెన్స్
  • పొలిటికల్ హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని ఆదేశం
Election Code strictly implementing in AP

కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఏపీలోనూ ఎన్నికల కోడ్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు. 

కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనలతో కూడిన హోర్డింగులు, కటౌట్లు, పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ అదనపు సీఈవోలు, జిల్లా ఎన్నికల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. 

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు పొలిటికల్ హోర్డింగులు, కటౌట్లు తొలగించాలని ఆదేశించారు. ముఖ్యంగా, రాష్ట్ర సెక్రటేరియట్ పరిసరాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసుల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. 

ఇక సీ విజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ముఖేశ్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. కోడ్ అమలు రీత్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించాలని పేర్కొన్నారు.

More Telugu News