Revanth Reddy: ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా... షర్మిలను సీఎం సీట్లో కూర్చోబెట్టే వరకు తోడుగా ఉంటా: విశాఖ సభలో రేవంత్ రెడ్డి

  • విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం
  • షర్మిలకు ఐదుగురు ఎంపీలను, 25 మంది ఎమ్మెల్యేలను ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి
  • వైఎస్ రాజకీయ వారసురాలు షర్మిలేనని వ్యాఖ్య
  • ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. అందుకే వెనక్కి వెళుతున్నానని షర్మిల చెప్పి వచ్చారన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy says he will support sharmila and andhra pradesh

"నేను మీ పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రిని.. ఏపీ కోసం కొట్లాడే షర్మిలకు అండగా నిలబడతాను... మీకు అండగా నిలబడతాను... మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను... షర్మిలను ఏపీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టే వరకు ఆమెకు తోడుగా ఉంటాను.. మీరు సిద్ధమా?" అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. శనివారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు వైపులా ఉద్దండులు చంద్రబాబు, జగన్ ఉన్నారు.. మనతో ఏమవుతుందని అనుకోవద్దన్నారు. తెలంగాణలో ఇలాగే ఉండేనని... కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో కేవలం 3200 ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తాము అధైర్యపడకుండా కొట్లాడి మోడీని ఓడించాం.. కేడీని పడగొట్టామని వ్యాఖ్యానించారు. ప్రజలు చాలా తెలివైనవారని విజ్ఞులు అన్నారని, అందుకే తెలంగాణలో తమకు 5 సీట్ల నుంచి 65 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు.

షర్మిలకు ఐదుగురు ఎంపీలను, 25 మంది ఎమ్మెల్యేలను ఇవ్వండి

ఏపీలో ఇప్పుడు మీకు కావాల్సింది పాలకులు కాదని... ఢిల్లీలో ప్రశ్నించేవారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్... ఇద్దరిలో ఎవరు గెలిచినా మోదీ వైపే ఉంటారని... కానీ షర్మిలకు ఐదుగురు ఎంపీలను, 25మంది ఎమ్మెల్యేలను ఇస్తే చాలు, ఆమె ఏపీ ప్రజల తరఫున పోరాడుతారన్నారు. అప్పుడు రాజధాని అమరావతి పూర్తవుతుంది... పోలవరం పూర్తవుతుంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు కాకుండా ఆపుతుందన్నారు. కొన్ని సీట్లు ఇస్తే చాలు మీ సమస్యలు ఎలా పరిష్కారం కావో షర్మిలమ్మనే చూసుకుంటుందన్నారు. ఆమె కంచె వేసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిజమైన వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు.

వైఎస్ వారసత్వం షర్మిలదే...

షర్మిల... వైఎస్ రాజశేఖరరెడ్డి వారసురాలు ఎలా అవుతుందని ఈ మధ్య కొంతమంది ప్రశ్నిస్తున్నారని... కానీ అసలైన వారసురాలు ఆమే అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని... ఏపీ ప్రజల కష్టాలు తీర్చాలని వైఎస్ అనుకున్నారని... ఇప్పుడు షర్మిల అదే బాటలో నడుస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ తరఫున కొట్లాడే వ్యక్తులు కావాలని.. వైఎస్ ఆశయ సాధన కోసం పనిచేసేవారు కావాలని... ఆ బాటలో నడుస్తున్న షర్మిలకు అండగా ఉండాలన్నారు. షర్మిల అంటేనే వైఎస్ అని వ్యాఖ్యానించారు. కానీ వైఎస్ వారసుడిని అని ఇప్పుడు చెప్పుకుంటున్న వారు మోదీ వైపు ఉన్నారని ఆరోపించారు. వైఎస్ ఎప్పుడూ సెక్యులర్‌గా ఉంటే... జగన్ ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారో ఆలోచించాలని సూచించారు.

ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పి షర్మిల వచ్చారు...

ఏపీలోని ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. వారి తరఫున పోరాడేందుకు తనకు వయస్సు ఉంది.. ఓపిక ఉంది.. అందుకే మళ్లీ వెనక్కి వెళుతున్నా అని షర్మిల చెప్పి ఏపీకి వచ్చారని చెప్పారు. వైఎస్ బిడ్డగా... ఆయన వారసురాలిగా.. వైఎస్ ఆశయాలను సాధించి కాంగ్రెస్ జెండాను ఏపీలో నిలబెట్టి... ఏపీ హక్కులను సాధిస్తానని షర్మిల ధైర్యంగా చెప్పారని తెలిపారు. అచ్చోసిన ఆంబోతుల్లా వారు ఉంటే షర్మిల మాత్రం పోలవరం పూర్తి చేయాలని... అమరావతి కట్టాలని వచ్చారని తెలిపారు. మీ మధ్య ఉండాలని... మీ కోసం పోరాడాలని షర్మిల ఏపీకి వచ్చారని వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. అప్పనంగా అధికారం వస్తుందనో కాదు... మీ కోసం షర్మిల వచ్చారని తెలిపారు. అందుకే ప్రజలు ఆమెకు అండగా నిలబడాలన్నారు. విశాఖ సింగపూర్‌లో ఉంటుందన్నారు.  విశాఖ సభను చూస్తుంటే హైదరాబాద్‌లో సభను చూస్తున్నట్లుగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

More Telugu News