BCCI: ఐపీఎల్ 2024 రెండవ దశ యూఏఈకి తరలింపు!

BCCI Officials Exploring Possibility of Organizing 2nd Half of IPL 2024 in UAE says report
  • లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో యోచిస్తున్న ఐపీఎల్ పాలక మండలి
  • సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఇప్పటికే పలువురు అధికారులు దుబాయ్ వెళ్లినట్టుగా వెలువడుతున్న కథనాలు
  • మార్చి 22 నుంచి మొదటి దశ ఐపీఎల్ మ్యాచ్‌లు
ఐపీఎల్ 2024 రెండవ దశను విదేశాల్లో నిర్వహించడంపై లీగ్ పాలక మండలి యోచిస్తోందని, యూఏఈకి తరలించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి ఉంటుంది కాబట్టి విదేశాల్లో నిర్వహించడం ఉత్తమమని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు పలువురు బీసీసీఐ అధికారులు ఇప్పటికే యూఈఏ వెళ్లారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొన్ని ఫ్రాంచైజీలు ముందు జాగ్రత్తగా ఆటగాళ్ల పాస్‌పోర్ట్‌లను సేకరించాయని సమాచారం. అయితే లీగ్ భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో అనివార్యంగా ఏమైనా జరిగితే తప్ప విదేశాలకు తరలివెళ్లే అవకాశం లేదని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే పాస్‌పోర్టులను సేకరిస్తున్నట్టుగా ఆయా వర్గాలు చెబుతున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాగా చెన్నై వేదికగా మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 ఎడిషన్ షురూ కానుంది. అయితే ప్రస్తుతానికి మొదటి విడత షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి రెండవ దశ షెడ్యూల్‌ను రూపొందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా మొదటిసారి 2014లో దుబాయ్ వేదికగా ఐపీఎల్ టోర్నీ జరిగింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా అక్కడ నిర్వహించారు. ఇక కొవిడ్ కారణంగా 2020, 2021లో కూడా అక్కడే లీగ్‌ను నిర్వహించారు. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా ఈ మ్యాచ్‌లను నిర్వహించారు.
BCCI
IPL
IPL2024
Dubai
UAE
Cricket

More Telugu News