RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్ లోకి ప్రవీణ్

RS Praveen Kumar resigns BSP
  • తెలంగాణ రాజకీయాల్లో మరో సన్నివేశం
  • ఇటీవలే బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు
  • ఇంతలోనే బీఎస్పీకి గుడ్ బై చెప్పిన ప్రవీణ్
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటుచేసుకుంది. బీఎస్పీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో ఆయన చేరబోతున్నారు. కేసీఆర్ తో ప్రవీణ్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజు కూడా గడవకుండానే ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడం గమనార్హం. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ పోటీ చేయనున్నారు. 

బీఎస్పీని వీడాలనే నిర్ణయాన్ని ఎంతో బాధతో తీసుకున్నానని ప్రవీణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణలో తన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో గొప్పదైన బీఎస్పీ ఇబ్బంది పడకూడదనేది తన భావన అని చెప్పారు. పొత్తులో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని... కష్టసుఖాలను పంచుకోవాల్సిందేనని చెప్పారు. తాను నమ్మిన నిజమైన ధర్మం ఇదేనని అన్నారు. 

నిన్న బీఎస్పీ - బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కవిత అరెస్ట్ కూడా ఇందులో భాగమేనని చెప్పారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలను ఇవ్వలేనని... తన ఈ ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. 

తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రవీణ్ చెప్పారు. చివరి వరకు బహుజనవాదాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటానని తెలిపారు. బహుజనుల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తానని చెప్పారు.
RS Praveen Kumar
BSP
KCR
BRS
TS Politics

More Telugu News