Ambati Rayudu: జ‌ట్టు ప్ర‌యోజ‌నాల కోసం.. ధోనీ ఆ ప‌ని చేసే అవ‌కాశం ఉంది: అంబ‌టి రాయుడు

  • ఇంపాక్ట్ రూల్ ద్వారా ధోనీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు మ‌రొక‌రికి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌న్న రాయుడు 
  • ఈ ప్ర‌యోగం ద్వారా చెన్నైకి మంచి సార‌థి దొరికే అవ‌కాశం ఉందంటూ మాజీ క్రికెట‌ర్ జోస్యం
  • 2022లో ర‌వీంద్ర జ‌డేజాకు కెప్టెన్సీ ఇచ్చి.. చేతులు కాల్చుకున్న చెన్నై
MS Dhoni Can Take Backseat And Promote Someone To Lead CSK says Ambati Rayudu

చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇంపాక్ట్ రూల్‌ను వినియోగించుకుని.. కెప్టెన్‌గా మ‌రొక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు అన్నాడు. చెన్నై కొత్త కెప్టెన్‌ను సిద్ధం చేయ‌డానికి ధోనీ ఇంపాక్ట్ నిబంధ‌న‌ను వాడుకుని వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో మ్యాచుల మ‌ధ్య ఓవ‌ర్ల‌లో వేరొక‌రికి కెప్టెన్సీ అప్ప‌గించాలి. ఈ ప్ర‌యోగం ద్వారా చెన్నైకి మంచి సార‌థి దొరికే అవ‌కాశం ఉంద‌ని రాయుడు అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇక 2022 ఐపీఎల్‌లో చెన్నై ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించి ప్ర‌యోగం చేసింది. కానీ, జ‌డ్డూ జ‌ట్టును న‌డిపించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. దాంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో సీజ‌న్ మ‌ధ్య‌లో మ‌ళ్లీ ధోనీ కెప్టెన్సీ చేప‌ట్టాల్సి వ‌చ్చింది. 

ఇక గ‌తేడాది కెప్టెన్ కూల్ సార‌థ్యంలోనే బ‌రిలోకి దిగిన చెన్నై.. ఏకంగా టైటిల్ గెలిచింది. దీంతో ఐదుసార్లు టైటిల్ విజేత‌గా ముంబై ఇండియ‌న్స్ స‌ర‌స‌న నిలిచింది. ప్ర‌స్తుతం ధోనీ వ‌య‌సు 42 ఏళ్లు. బ‌హుశా ఈ సీజ‌నే అత‌నికి ఆఖ‌రిది కూడా కావొచ్చు. అందుకే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవ‌డం బెట‌ర్‌. 

ఈ నేప‌థ్యంలోనే చెన్నై మాజీ ఆట‌గాడు అంబ‌టి రాయుడు స్టార్ స్పోర్ట్స్ ప్రెస్‌రూంలో మాట్లాడుతూ.. "ప్ర‌స్తుతం ఇంపాక్ట్ రూల్ అమ‌లులో ఉంది. దీంతో సార‌థిగా ఎవ‌రో ఒక‌రిని ముందుంచి.. జట్టును ధోనీ న‌డిపే అవ‌కాశం లేక‌పోలేదు. స‌ద‌రు వ్య‌క్తి కెప్టెన్‌గా కుదురుకొనే వ‌ర‌కూ అలాగే కొన‌సాగిస్తాడు. ఇది త‌మ జ‌ట్టుకు కొత్త‌ సార‌థిని ఎంచుకునేందుకు చెన్నైకి ఇదే స‌రియైన ఏడాది. ఒక‌వేళ ధోనీ మ‌రికొన్నేళ్లు ఆడాల‌నుకుంటే మాత్రం క‌చ్చితంగా అత‌డే కెప్టెన్‌గా ఉంటాడు. నేను మాత్రం వ్య‌క్తిగ‌తంగా అత‌డిని సార‌థిగా చూడ‌టానికే ఇష్ట‌ప‌డ‌తాను" అని రాయుడు చెప్పుకొచ్చాడు. 

ఇదిలాఉంటే.. ఇటీవ‌ల ధోనీ ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో త‌న‌ను కొత్త రోల్‌లో చూడ‌నున్నార‌ని ఫేస్‌బుక్ ద్వారా ప్ర‌క‌టించి సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై కూడా రాయుడు స్పందించాడు. ధోనీ ఒకవేళ త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపాడు. ఎందుకంటే ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ కాన్వే గాయం కార‌ణంగా ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్నాడు. అందుకే మ‌హీ తాను బ్యాటింగ్‌కు 6, 7 స్థానాల‌లో కాకుండా ఇంకా త్వ‌ర‌గా క్రీజులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాయుడు పేర్కొన్నాడు. కాగా, ఈ ఏడాది అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకున్న అంబ‌టి రాయుడు.. ఐపీఎల్ 2024లో కామెంట‌ర్‌గా కొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నాడు.

More Telugu News