Amit Shah: 303 మంది ఎంపీలున్న మాకు 6 వేల కోట్లు! 242 మంది ఎంపీలున్న వాళ్లకు 14 వేల కోట్లు: అమిత్ షా

  • ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్న హోం మంత్రి అమిత్ షా
  • అయితే, పథకాన్ని రద్దు చేయకుండా మెరుగుపరిస్తే బాగుండేదని వ్యాఖ్య
  • కాంగ్రెస్ నగదు రూపంలో విరాళాలు తీసుకునేదని వెల్లడి
  • అతి తక్కువ మొత్తాన్ని పార్టీ అకౌంట్లో వేసి మిగతా దాంతో జేబులు నింపుకునే వారని ఆగ్రహం
Amit Shah comments on electoral bond donations

ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. అయితే, రాజకీయాల్లో నల్ల ధనం కట్టడికి తెచ్చిన ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే బదులు మరింత మెరుగుపరిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 

ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేది బీజేపీ, ప్రధాని మోదీల ఆలోచన అని షా అన్నారు. ఇది అమల్లోకి వస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, పదే పదే పెట్టాల్సిన ఎన్నికల ఖర్చులకు బ్రేక్ పడుతుందని చెప్పారు. 

కాంగ్రెస్ నగదు రూపంలో డొనేషన్లు తీసుకునేదని అమిత్ షా పేర్కొన్నారు. అలా రూ.1100 వస్తే అందులోని రూ.100 పార్టీ అకౌంట్లో వేసి మిగతా మొత్తంతో తమ జేబులు నింపుకునేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలక్టోర్ బాండ్స్‌తో బీజేపీనే భారీగా లాభపడిందన్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘‘మీకో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందిన రూ.20 వేల కోట్లలో బీజేపీకి సుమారు రూ.6 వేల కోట్లు వచ్చాయి. మరి మిగతా మొత్తం ఏమైనట్టు? టీఎంసీకి రూ.1600 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1400 కోట్లు, బీఆర్‌ఎస్‌కు రూ.1200 కోట్లు. బీజేడీకి రూ.750 కోట్లు, డీఎమ్‌కేకి రూ.639 కోట్లు వచ్చాయి. 303 మంది ఎంపీలున్న మాకు 6 వేల కోట్లు వస్తే 242 ఎంపీలున్న ప్రతిపక్షాలకు రూ.14000 కోట్లు వచ్చాయి. మరి ఈ గోల అంతా ఎందుకు? ఈ అకౌంట్లన్నీ సెటిలయ్యాక వారు మీకు ముఖం చూపించలేరు ’’ అని ఆయన అన్నారు.

More Telugu News