Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల దందా: రాహుల్ గాంధీ

  • ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రధాని మానస పుత్రిక అని వ్యాఖ్య
  • ప్రధాని కనుసన్నల్లో జరిగిన భారీ చోరీ అని విమర్శ
  • ఎలక్టోరల్ బాండ్స్ నిధులతో పార్టీలను చీల్చి, ప్రభుత్వాలను కూల్చారని ఆగ్రహం
Electoral Bonds Scheme Worlds Biggest Extortion Racket Alleges Rahul Gandhi

ప్రపంచంలో అతిపెద్ద వసూళ్ల దందా ఎలక్టోరల్ బాండ్స్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ పథకాన్ని నరేంద్ర మోదీ మానసపుత్రికగా అభివర్ణించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర చివరి అంకంలో భాగంగా ఆయన ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

‘‘రాజకీయ నిధుల సమీకరణ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తెచ్చినట్టు కొన్నేళ్ల క్రితం మోదీ ఘనంగా ప్రకటించారు. కానీ ఇది కార్పొరేట్ సంస్థ నుంచి బలవంతపు వసూళ్లకు సాధనంగా మారింది. బీజేపీకి నిధులు ఇచ్చేలా కార్పొరేట్ సంస్థలను ఒప్పించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద వసూళ్ల దందా. దీనిపై విచారణ జరుగుతుందనే అనుకుంటున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు. 

బీజేపీకి నిధులు ఇచ్చిన కంపెనీల్లో కొన్నింటికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టులు దక్కడంపై కూడా రాహుల్ గాంధీ స్పందించారు. హైవేలు, రక్షణ రంగానికి చెందిన జాతీయ స్థాయి కాంట్రాక్టులపై  ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని అన్నారు. ఐటీ, ఈడీ సంస్థలు కూడా వారి పరిధిలో ఉండవని గుర్తు చేశారు. జనాల ఫోన్లలో పెగస్ (నిఘా సాఫ్ట్‌వేర్‌లు) పెట్టలేరని ఎద్దేవా చేశారు. 

‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టుల జారీ, మాకు అందే నిధులకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కార్పొరేట్ కంపెనీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగడమే. ప్రతి కార్పొరేట్ సంస్థకు ఈ విషయం తెలుసు. కాంట్రాక్టులు దక్కించుకున్న కొన్ని నెలలకు అవి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ విరాళంగా ఇచ్చాయి. సీబీఐ, ఈడీ కేసులు దాఖలు చేశాక కార్పొరేట్లు బీజేపీకి డబ్బిస్తారు’’ అని రాహుల్ అన్నారు. తమ వివరాలు బహిర్గతం కాకుండా కార్పొరేట్లు విరాళాలు ఇచ్చేందుకు ఉపకరించే పథకం ఇదని అన్నారు. 

‘‘ప్రధాని మోదీ కనుసన్నల్లో సాగిన భారీ చోరీ ఇది. శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీలను చీల్చేందుకు, ప్రభుత్వాలను కూల్చేందుకు నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సేకరించారు’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.

More Telugu News