Sudha Murthy: భార్యలకు వంటగదిలో సహాయం చెయ్యండయ్యా!: పురుషులకు సుధామూర్తి సూచన

  • ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి
  • కొన్ని రోజుల కిందటే ప్రమాణస్వీకారం
  • భార్యలపై ఉన్న భారాన్ని పంచుకోవాలని మగాళ్లకు పిలుపు
  • గొడవలు లేకపోతే వాళ్లు భార్యాభర్తలే కారని వ్యాఖ్యలు
Sudha Murthy appeals men to help wives in kitchen

ఇటీవలే రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన సుధామూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క పురుషుడు తన భార్యకు వంటగదిలో సహాయం చేయాలని పిలుపునిచ్చారు. "ఈ తరం మగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే... కిచెన్ లో భార్యలకు చేదోడువాదోడుగా ఉండండి... ఆమెపై ఉన్న భారాన్ని మీరు కూడా పంచుకోండి... కష్టాలను పంచుకోండి... భార్యాభర్తల అనుబంధంలో ఇది చాలా ముఖ్యం" అని సుధామూర్తి పేర్కొన్నారు. 

దంపతుల మధ్య గొడవలు మామూలేనని, అయితే ఆ గొడవలతో ఇద్దరూ కలత చెందారంటే మరిన్ని గొడవలకు ఆజ్యం పోసినట్టేనని అన్నారు. "పెళ్లి చేసుకున్నారంటే... ఇక గొడవలకు సిద్ధంగా ఉన్నారన్న మాటే. ఆ నిజాన్ని అందరూ అంగీకరించాలి. మేం ఎప్పుడూ పోట్లాడుకోలేదండీ అని ఎవరన్నా అన్నారంటే... వాళ్లు భార్యాభర్తలే కాదు" అని సుధామూర్తి వ్యాఖ్యానించారు. 

తన భర్త, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి... తనకు మధ్య కూడా గొడవలు వస్తాయని వెల్లడించారు. అయితే, తన భర్త కోపంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని, అదే సమయంలో తాను చెప్పింది కూడా వినాలని ఆయనకు అర్థమయ్యేలా చెబుతానని సుధామూర్తి వివరించారు. 

"దంపతుల్లో ఒకరు కోపంగా ఉంటే మరొకరు శాంతంగా ఉండాలి... అంతేగానీ నోటికి పనిచెప్పకూడదు. నారాయణమూర్తి కోపంగా ఉంటే నేనసలు మాట్లాడను. తన కోపం అంతా వెళ్లగక్కిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. నేను కోపంగా ఉంటే ఆయన మౌనంగా ఉంటారు. నిజ జీవితంలో మాత్రం నేను ఎక్కువ శాతం సర్దుకుపోతుంటాను" అని సుధామూర్తి వివరించారు. 

జీవితం అంటే ఇచ్చిపుచ్చుకోవడమేనని అన్నారు. నికార్సయిన జీవితం అంటే ఇదీ, దంపతులు అంటే వీళ్లే అనే కొలమానాలు ఎక్కడా ఉండవని... కొన్ని ప్లస్ లు ఉంటాయి, కొన్ని మైనస్ లు ఉంటాయని అభిప్రాయపడ్డారు. అవతలి వ్యక్తి ఎలా మన జీవితంలోకి తన ప్లస్ లు, మైనస్ లతో వస్తాడో... మనం కూడా ఆ వ్యక్తి జీవితంలోకి మన ప్లస్ లు, మైనస్ లతో ప్రవేశిస్తామని సుధామూర్తి పేర్కొన్నారు. ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.

More Telugu News