Peethala Sujatha: టీడీపీ అధిష్ఠానంపై పీతల సుజాత తీవ్ర అసంతృప్తి... చంద్రబాబు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి

  • ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు
  • పొత్తు కారణంగా అందరికీ టికెట్లు కేటాయించలేకపోతున్న టీడీపీ
  • పార్టీలో చెలరేగుతున్న అసంతృప్త జ్వాలలు
  • తనకు టికెట్ దక్కకపోవడంపై ఆక్రోశించిన మాజీ మంత్రి పీతల సుజాత
Peethala Sujatha disappoints with TDP high command decision

చింతలపూడి టికెట్ ఆశించిన టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర నిరాశకు గురయ్యారు. చింతలపూడి టికెట్ ను టీడీపీ హైకమాండ్ సొంగా రోషన్ కుమార్ కు కేటాయించడమే అందుకు కారణం. దాంతో ఆమె ఓ వీడియోతో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పాటుపడుతున్న తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్కడో ఒక చోట తనకు టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

"ఇవాళ పార్టీలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. నేను చంద్రబాబునాయుడి భక్తురాలిని. 20 ఏళ్లుగా ఆయనను ఒక గాడ్ ఫాదర్ లా భావించి పూజించాను. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తాను. చంద్రబాబు అన్నా, టీడీపీ అన్నా ఎంతో కృతజ్ఞత ఉంది. ఎందుకంటే, టీడీపీ పార్టీ పెట్టిన 1982 నుంచి మా నాన్న మొదలుకొని మేమంతా పార్టీ కోసం సైనికుల్లా పనిచేశాం. మండల టీడీపీ ప్రెసిడెంట్ స్థాయి నుంచి వివిధ స్థాయుల్లో పార్టీ కోసం పాటుపడ్డాం. 

నాన్న గారికి రావాల్సిన సీటును 2004లో మహిళా కోటా కింద ఆచంటలో నాకు ఇచ్చారు. అప్పటివరకు టీచర్ గా ఉన్న నన్ను చంద్రబాబు గారు రిజైన్ చేయించి రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అదెంతో శుభపరిణామం. అప్పటి నుంచి టీడీపీ కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాను. ఇప్పటికీ చంద్రబాబును, లోకేశ్ ను, వారి కుటుంబాన్ని, పార్టీని ఎంతో గౌరవిస్తాను. 

పార్టీలో నేను కొంతమందితో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీని బజార్లోకి లాగాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు సీట్ల విషయానికొస్తే నా మనసు ఎంతో బాధపడుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. మాల సామాజికవర్గం కింద కానివ్వండి, మహిళా కోటా కింద కానీ, ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశించాను. 

20 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న నేను టికెట్ కోసం ఆశపడడంలో తప్పులేదు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వెనుకంజ వేయకుండా ముందుకెళుతున్నాను. 2004లో ఆచంట నుంచి ప్రజలందరూ గెలిపించారు. స్థానిక మద్దతు ఉంది, పార్టీ తోడ్పాటు ఉంది. 2009లో నాకు టికెట్ ఇవ్వకపోయినా, చంద్రబాబు నిర్ణయం కాబట్టి గౌరవించాను. 2014లో చింతలపూడి నుంచి నాకు టికెట్ ఇచ్చారు. అప్పుడు గెలవడంతో మంత్రి పదవి కూడా ఇచ్చారు. అందుకు ఎంతో సంతోషించాను. 

కానీ 2015 నుంచి నియోజకవర్గంలో కొందరు నాయకులు నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నేను బయటికొచ్చి మాట్లాడితే చంద్రబాబుకు, పార్టీకి చెడ్డపేరు వస్తుందని అన్నీ భరించాను. 2019లో టికెట్ రాలేదు. అప్పటి నుంచి అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారైనా టికెట్ ఇస్తారన్న నా ఎదురుచూపులు నిరాశనే మిగిల్చాయి. 

జవహర్ గారు కూడా మంత్రిగా పనిచేశారు... ఇవాళ జిల్లాలో ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేదు. మేం ఏం తప్పు చేశాం... మాకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వరా? వర్గ పోరు ఏ నియోజకవర్గంలో లేదు? అన్ని నియోజకవర్గాలు కరెక్ట్ గా ఉన్నాయా? ఓ దళిత మహిళగా అడుగుతున్నా... టికెట్ పై చంద్రబాబు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. 

ఇప్పటివరకు నాకు రెండు సార్లు టికెట్ ఇస్తే రెండు సార్లు గెలిచాను. సుజాతకు టికెట్ ఇస్తే గ్రూపులు కడుతుంది అనే ఆరోపణలేవీ నాపై లేవు కదా. నాపై ఎన్ని అభాండాలు వేసినా మౌనంగా ఉన్నాను. చంద్రబాబు నాకు జీవితం ఇచ్చారు కాబట్టి పార్టీకి చెడు జరగకూడదని అన్నీ సహిస్తున్నాను. 

పార్టీలోకి ఎన్నారైలు వస్తున్నారని, పక్క రాష్ట్రాల వారు వస్తున్నారని చెబుతున్నారు... వీళ్లందరూ నిలకడగా ఉండేవాళ్లు కారండీ. పార్టీ కోసం బట్టలు చించుకుని కష్టపడేవాళ్లే ఎప్పటికైనా పార్టీ కోసం నిలుస్తారు. పార్టీ నాయకత్వం ఒక్కసారి పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ  పీతల సుజాత భావోద్వేగాలతో వ్యాఖ్యానించారు.

More Telugu News