BCCI: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు బీసీసీఐ తీపి క‌బురు..!

  • శ్రేయ‌స్‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను పున‌రుద్ధ‌రించే యోచ‌న‌లో బీసీసీఐ
  • దేశ‌వాళీ క్రికెట్‌ ఆడ‌టానికి ఆస‌క్తి చూప‌లేద‌నే కార‌ణంతో 2023-24 సీజ‌న్‌కు కాంట్రాక్ట్ కోల్పోయిన యువ ఆట‌గాడు
  • ఇటీవ‌ల‌ రంజీలో ఆడి స‌త్తాచాటిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌
  • ఈ విష‌య‌మే బీసీసీఐని పున‌రాలోచ‌న‌లో ప‌డేసింద‌న్న రెవ్‌స్పోర్ట్జ్ నివేదిక
  • ఐపీఎల్‌లోనూ బ‌రిలోకి దిగుతున్న శ్రేయ‌స్‌  
BCCI Considering Restoring Shreyas Iyer Central Contract After Ranji Trophy Final Heroics says Report

దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడ‌టానికి ఆస‌క్తి చూప‌డంలేద‌నే కార‌ణంతో యువ ఆట‌గాళ్లు శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల‌ను బీసీసీఐ గ‌త నెల‌లో 2023-24 సీజ‌న్‌కు గాను సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. అయితే, శ్రేయ‌స్‌పై వేటు వేసిన బీసీసీఐ వైఖ‌రి ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అతడిని సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించ‌డంపై ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు సైతం బ‌హిరంగంగానే బీసీసీఐ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. కాగా, తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ యువ క్రికెట‌ర్‌కు బీసీసీఐ తీపి క‌బురు చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. శ్రేయ‌స్‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను పున‌రుద్ధ‌రించే యోచ‌న‌లో బీసీసీఐ ఉంద‌ని స‌మాచారం. 

ఇక ఇషాన్ కిష‌న్ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి అర్థాంత‌రంగా స్వ‌దేశానికి తిరిగొచ్చాడు. ఆ త‌ర్వాత ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడ‌లేదు. కానీ, శ్రేయ‌స్ మాత్రం టీమిండియాతోనే ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో మొద‌టి రెండు టెస్టుల‌కు జ‌ట్టులో ఉన్నాడు. కానీ, మొద‌టి టెస్టు త‌ర్వాత గాయం కార‌ణంగా రెండో టెస్టు ఆడ‌లేదు. ఆ త‌ర్వాత గాయం తిర‌గ‌బెట్ట‌డంతో ఎన్‌సీఏకి వెళ్లిపోయాడు. అక్క‌డ కొన్ని రోజులకు ఫిట్‌నెస్ నిరూపించుకొని తిరిగి రంజీ మ్యాచులు ఆడాడు. ముంబై త‌ర‌ఫున సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచుల్లో బ‌రిలోకి దిగాడు. అంతేగాక ఫైన‌ల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 95 ప‌రుగుల‌తో స‌త్తాచాటాడు కూడా. శ్రేయ‌స్ ఆడిన వ‌న్డే త‌రహా ఈ ఇన్నింగ్స్ ముంబై విజ‌యానికి కార‌ణ‌మైంది.  

శ్రేయ‌స్‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ పున‌రుద్ధ‌రించే యోచ‌న‌లో బీసీసీఐ
రెవ్‌స్పోర్ట్జ్ నివేదిక ప్ర‌కారం శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను తిరిగి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఇవ్వాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉంద‌ట‌. ఇక శ్రేయ‌స్ విద‌ర్భ‌తో జ‌రిగిన రంజీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 4, 5వ రోజు ఫీల్డింగ్ చేసేందుకు రాలేదు. దాంతో అత‌డి ఫిట్‌నెస్‌పై సందేహాలు నెల‌కొన్నాయి. శ్రేయ‌స్‌కు వెన్నునొప్పి మ‌ళ్లీ తిర‌గ‌బెట్టిందా? అనే అనుమానం త‌లెత్తింది. అయితే, అత‌డు పూర్తిగా ఫిట్‌గానే ఉన్నాడ‌ని రెవ్‌స్పోర్ట్జ్ నివేదిక పేర్కొంది. 

అంతేగాక ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజ‌న్‌కు మొద‌టి నుంచి అందుబాటులో ఉంటాడ‌ని వెల్ల‌డించింది. స‌న్‌రైజ‌ర్స్‌తో కేకేఆర్ త‌ల‌ప‌డే మొద‌టి మ్యాచ్ నుంచి శ్రేయ‌స్ బ‌రిలోకి దిగ‌నున్నాడ‌ని తెలిపింది. ఇదిలాఉంటే.. శ్రేయ‌స్ అయ్యర్‌కు గతేడాది బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సంద‌ర్భంగా వెన్నునొప్పి గాయ‌మైంది. దాంతో స‌ర్జరీ త‌ర్వాత‌ ఐపీఎల్ సీజ‌న్ మొత్తం ఆడ‌లేదు. గాయం కార‌ణంగా శ్రేయస్ అయ్య‌ర్ జ‌ట్టుకు దూరం కావ‌డంతో 2023 ఐపీఎల్ సీజ‌న్‌లో కేకేఆర్ ప‌గ్గాలు యువ ఆట‌గాడు నితీష్ రాణాకు ద‌క్కాయి. ఈసారి మ‌ళ్లీ శ్రేయ‌స్ సార‌థ్య బాధ్య‌త‌లు తీసుకుంటాడు. నీతిష్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు.

More Telugu News