ICC: టీ20 వరల్డ్ కప్ నుంచి క్రికెట్‌లో కొత్త రూల్.. భారీ మార్పునకు సిద్ధమైన ఐసీసీ

  • ‘స్టాప్ క్లాక్ రూల్‌’ను ప్రవేశపెట్టనున్న ఐసీసీ
  • ఓవర్ ముగిసిన 60 సెకన్లలో తదుపరి ఓవర్ ప్రారంభించడం తప్పనిసరి
  • రూల్‌ను ఉల్లంఘిస్తే 5 పరుగుల పెనాల్టీని విధించే అవకాశం
ICC set to make massive rule change ahead of T20 World Cup 2024

క్రికెట్ మ్యాచ్‌లను నిర్దేశిత సమయంలో ముగించడమే లక్ష్యంగా కొత్త నిబంధనను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. ఫీల్డింగ్ జట్టు ఓవర్ ముగిసిన 60 సెకన్ల వ్యవధిలోనే తదుపరి ఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘స్టాప్ క్లాక్ రూల్’ని ప్రవేశపెట్టనుంది. ఈ రూల్‌ను ఉల్లంఘించే జట్టుకు అంపైర్లు 5 పరుగుల పెనాల్టీని విధించవచ్చు. ఈ నిబంధనను అమలు పరచేందుకు గ్రౌండ్‌లో ఎలక్ట్రిక్ క్లాక్‌ను ప్రదర్శిస్తారు. ఓవర్ ముగిసిన వెంటనే అంపైర్లు టైమర్‌ని ఆన్ చేస్తారు. టైమ్‌ని ఫీల్డింగ్ జట్టు గమనించుకునే వీలుంటుంది. అయితే ఫీల్డింగ్ జట్టుకు పెనాల్టీ విధించడానికి ముందు అంపైర్లు రెండు సార్లు హెచ్చరిస్తారు. నిబంధన ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకున్నాక పెనాల్టీని విధిస్తారు. అయితే 60 సెకండ్లకు మించి ఆలస్యమవ్వడానికి కారణం ఏంటనేది అంపైర్లు నిర్ధారిస్తారు. ఆలస్యానికి బ్యాట్స్‌మెన్లు కారణమా, డీఆర్ఎస్ నిర్ణయమా, ఇంకేదైనా కారణమా అనేది అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు.

వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ నెలలో ఆరంభం కానున్న టీ20 ప్రపంచ కప్ నుంచి ఈ నిబంధనను ఐసీసీ అమలు చేయనుంది. ఈ మేరకు ఐసీసీ రూల్ బుక్‌లోని నిబంధనను చేర్చనున్నారు. గతేడాది డిసెంబర్‌ నుంచే ఈ రూల్‌ని ఐసీసీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ప్రామాణిక పరిస్థితుల్లో ఆడే మ్యాచ్‌ల్లో ఈ నిబంధనను అమలు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఈ నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే ఈ నిబంధనను అమలు చేయనున్నారు.

 ‘స్టాప్ క్లాక్ రూల్‌’ను శాశ్వతంగా అమలు చేసేందుకు దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో ఆమోదం లభించిందని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఈ రూల్‌ను ప్రవేశపెట్టనున్నారని తెలిపింది. నిజానికి గతేడాది జరిగిన ఆసియా కప్‌లోనే ప్రవేశపెట్టాలనుకున్నా సాధ్యపడలేదని పేర్కొంది.

More Telugu News