Praveen Kumar: హార్ధిక్ పాండ్యా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?.. బీసీసీఐపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

  • పాండ్యాకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్
  • ఆటగాళ్లందరికీ సమానమైన రూల్స్ ఉండాలని మండిపాటు
  • దేశవాళీ క్రికెట్ ఆడని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మాదిరిగా పాండ్యాను హెచ్చరించలేదన్న మాజీ క్రికెటర్
Ex India Star Praveen Kumar Slams BCCI for Hardik Pandya name annual Central contrat list

ఫిట్‌గా ఉండి జాతీయ జట్టుకు ఆడని సమయంలో రంజీ ట్రోఫీలోనూ పాల్గొనకపోవడంతో యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. అయితే దేశవాళీ క్రికెట్ ఆడకపోయినా హార్ధిక్ పాండ్యాకు ఏ-కేటగిరి కాంట్రాక్ట్ ఇవ్వడంపై పలువురు మాజీలు విమర్శలు గుప్పించారు. తాజాగా మరో భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా అని బీసీసీఐ పెద్దలను ప్రశ్నించాడు. 

‘‘పాండ్యా కూడా క్రికెట్ ఆడాలి కదా? అతడికి వేరే నిబంధన ఉందా? బీసీసీఐ పాండ్యాను కూడా హెచ్చరించాలి కదా?’’ అని నిలదీశాడు. శుభంకర్ మిశ్రా అనే జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు అందరికీ సమానమైన నిబంధనలను వర్తింపజేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశాడు. 

దేశవాళీ టీ20 టోర్నమెంట్లు మాత్రమే ఎందుకు ఆడతారని పరోక్షంగా పాండ్యాను ప్రశ్నించాడు. ప్లేయర్లు అన్ని ఫార్మాట్లు ఆడాలి కదా అని అన్నాడు. ఇప్పటికే దేశం తరపున ఏమైనా 60-70 టెస్టు మ్యాచ్‌లు ఆడారా? టెస్టు క్రికెట్ ఆడకూడదనుకుంటే రాతపూర్వకంగా చెప్పాలంటూ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్టులకు ఎంపిక చేయబోమని పాండ్యాకు సమాచారం ఉందేమో.. తనకు ఎలాంటి సమాచారం లేదని ప్రవీణ్ కుమార్ అన్నాడు. 

కాగా హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి మధ్యలోనే వైదొలగిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఇప్పటివరకు అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ అతడు టెస్ట్ క్రికెట్ ఆడే పరిస్థితి లేదని, అయితే త్వరలో అతడు దేశవాళీ క్రికెట్ ఆడతానని హామీ ఇవ్వడంతో సెంట్రల్ కాంట్రాక్టులో చోటు ఇచ్చినట్టుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసింది. కాగా ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో వారం రోజుల్లో టోర్నీ ఆరంభమవనుండడంతో జోరుగా ప్రాక్టీస్ ఆరంభించాడు.

More Telugu News