UNO: భారత్‌ అమోఘం.. ఐరాస ప్రశంసల జల్లు

  • సగటు ఆయుర్దాయం, తలసరి ఆదాయం విషయంలో అద్భుత పురోగతి సాధించిందంటూ మెచ్చుకోలు
  • 2023-24 మానవాభివృద్ధి సూచీలో 134వ స్థానంలో నిలిచిన భారత్
  • 1990తో పోల్చితే 49 శాతం మెరుగుపడిన స్కోరు
UNO Praises India on Life Expectancy and Per Capita Income improvement

భారత్‌పై ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు కురిపించింది. సగటు ఆయుర్దాయం, తలసరి ఆదాయం విషయంలో అద్భుతమైన పురోగతిని సాధించిందంటూ మెచ్చుకుంది. ఈ మేరకు గురువారం వెలువడిన ఐరాస మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) భారత్‌ను కొనియాడింది. 2021లో 62.5 ఏళ్లుగా సగటు ఆయుర్దాయం మరుసటి ఏడాది 2022లో 67.7 ఏళ్లకు పెరగడం అమోఘమని రిపోర్ట్ వ్యాఖ్యానించింది. 

ఇక తలసరి ఆదాయం విషయంలో చక్కటి పురోగతిని సాధించిందని, స్థూల జాతీయ ఆదాయం 12 నెలల వ్యవధిలోనే 6.3 శాతం వృద్ధి చెంది 6951 డాలర్లకు చేరిందని మెచ్చుకుంది. దేశంలో పాఠశాల విద్య కూడా పెరుగుతోందని పేర్కొంది. 0.644 స్కోరుతో 2023/24 మానవాభివృద్ధి సూచీలో 193 దేశాలకుగానూ ఇండియా 134వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. మధ్యస్థ స్థాయి మానవాభివృద్ధి కేటగిరిలో భారత్ నిలిచిందని తెలిపింది.

కాగా హెచ్‌డీఐ సూచీలో దేశాల ర్యాంకును నిర్ణయించేందుకు సగటు ఆయుర్దాయం, ఆరోగ్యకరమైన జీవితం, జీవన ప్రమాణాలు, విద్య అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1990లో భారత్ హెడ్‌డీఐ స్కోరు 0.434గా ఉండగా 2022 నాటికి 49 శాతం వృద్ధితో 0.64 స్కోరుకు చేరుకుంది.

More Telugu News