Chief Justice Of India: సుప్రీం కోర్టు కుక్ కుమార్తెకు భారత ప్రధాన న్యాయమూర్తి సన్మానం!

CJI Felicitates Daughter Of Supreme Courts Cook
  • అమెరికాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేయనున్న సుప్రీంకోర్టు కుక్ కుమార్తె ప్రజ్ఞ
  • ప్రముఖ యూనివర్సిటీల స్కాలర్‌షిప్‌లు దక్కించుకున్న ప్రజ్ఞకు సుప్రీం జడ్జిల ప్రశంసలు
  • ఆమె స్వదేశానికి తిరిగొచ్చి దేశసేవ చేయాలని ఆశిస్తున్నామన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
సుప్రీంకోర్టులో కుక్‌గా ఉన్న అజయ్ కుమార్ కూతురు ప్రజ్ఞను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు. అమెరికాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ స్కాలర్‌షిప్‌లు పొందిన ప్రజ్ఞను బుధవారం జడ్జిల లాంజ్‌లో స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందించారు. ‘‘తనంతట తానుగా ప్రజ్ఞ ఈ ఘనత సాధించింది. ఆమెకు కావాల్సినవన్నీ అందేందుకు మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం. మళ్లీ ఆమె స్వదేశానికి తిరిగొచ్చి దేశసేవ చేయాలని ఆశిస్తున్నాం. తను ఎంచుకున్న రంగంలో ఆమె అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తుందన్న నమ్మకం ఉంది. 1.4 బిలియన్ల భారతీయుల కలలను ఆమె తన వెంట తీసుకెళుతోంది’’ అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 

ఈ సందర్భంగా ప్రజ్ఞకు చీఫ్ జస్టిస్.. భారత రాజ్యాంగానికి సంబంధించి సుప్రీం న్యాయమూర్తులందరూ సంతకాలు చేసిన మూడు పుస్తకాలను కూడా బహూకరించారు. అనేక కష్టనష్టాలకోర్చి కూతురిని పెంచి పెద్ద చేసిన ప్రజ్ఞ తల్లిదండ్రులను కూడా శాలువా కప్పి సన్మానించారు. 

చీఫ్ జస్టిస్ సహా సుప్రీం న్యాయమూర్తులందరికీ ఈ సందర్భంగా ప్రజ్ఞ ధన్యవాదాలు తెలిపారు. తన కెరీర్‌లో పురోగతి తల్లిదండ్రుల వల్లే సాధ్యమైందని అన్నారు. ‘‘వారికి కూతురుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. స్కూల్ రోజుల నుంచీ నాన్న నాకు అన్ని రకాలుగా సాయం చేశారు. నాకు అన్ని అవకాశాలు దక్కేలా చర్యలు తీసుకున్నారు’’ అని అన్నారు. తాను న్యాయవాద వృత్తిని ఎంచుకునేందుకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కేసు విచారణల లైవ్ స్ట్రీమింగ్ వల్ల ఆయన వ్యాఖ్యలను నేరుగా వినే అవకాశం అందరికీ దక్కిందన్నారు. ఆయన పలుకులు రత్నాలని, ఆయనే తనకు స్ఫూర్తి అని తెలిపారు.
Chief Justice Of India
Supreme Court
Pragna
Cook's Daughter

More Telugu News