Rishabh Pant: ఎంతో ఉత్సాహం.. కొంత ఒత్తిడి: రీఎంట్రీపై రిషభ్ పంత్ వ్యాఖ్య

  • 2022 నాటి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వికెట్ కీపర్ రిషభ్ పంత్
  • 14 నెలల విరామం తరువాత ఐపీఎల్‌తో రీఎంట్రీకి సిద్ధం
  • మళ్లీ అరంగేట్రం చేస్తున్నట్టు ఉందన్న పంత్
  • బీసీసీఐకి, జాతీయ క్రికెట్ అకాడమీకి ధన్యవాదాలు చెప్పిన వైనం
Rishabh pant on playing cricket again after recovering from road accident

ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్, రిషభ్ పంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. త్వరలో ఐపీఎల్‌తో పునరాగమం చేయనున్నాడు. పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. తమ కెప్టెన్ తిరిగొస్తున్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పునరాగమనంపై పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఎంతో ఉత్సాహంగా ఉంది. కొంత ఒత్తిడికి కూడా లోనవుతున్నా. మళ్లీ అరంగేట్రం చేస్తున్న భావన కలుగుతోంది. తిరిగి క్రికెట్ ఆడటం అంటే ఒక అద్భుతంలా అనిపిస్తోంది. నా శ్రేయోభిలాషులు, అభిమానులు.. అన్నింటికీ మించి బీసీసీఐ, జాతీయ క్రికెట్ అకాడమీ సిబ్బందికి నా ధన్యవాదాలు. నా ఢిల్లీ కుటుంబంతో మళ్లీ కలిసేందుకు, అభిమానుల ముందు ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారు. 

2022 చివర్లో రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. యాక్సిడెంట్ కారణంగా అతడు దాదాపు 14 నెలలు ఆటకు దూరమయ్యాడు. పంత్ మళ్లీ క్రికెట్ ఆడటం దాదాపు అసాధ్యమని అప్పట్లో అతడికి చికిత్స చేసిన వైద్యులు భావించారట. కానీ పంత్ మాత్రం పట్టుదలతో కోలుకున్నాడు. ప్రమాదం తరువాత పంత్‌తో తన సంభాషణ గురించి డాక్టర్ దిన్షా పర్దవాలా గుర్తు చేసుకున్నారు. ‘నువ్వు మళ్లీ క్రికెట్ ఆడితే అదొక అద్భుతమే’ అని నేనన్నా. ఎందుకంటే అతడి మోకాలికి తీవ్ర స్థాయి ప్రమాదం జరిగింది. కానీ దానికి పంత్ బదులిస్తూ ‘నేను అద్భుతాలు చేసే వ్యక్తిని’ అని అన్నాడు అని బీసీసీఐ టీవీతో దిన్షా తెలిపారు.

More Telugu News