BJP: మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్... 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల

  • మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ
  • పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి నగేశ్ పేర్లు ప్రకటించిన అధిష్ఠానం
  • రెండు జాబితాల్లో కలిపి 15 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
BJP releases second list with 72 candidates

రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఉన్నాయి. మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి నగేశ్ పేర్లను ప్రకటించింది. మొదటి జాబితాలో 9 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 15 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మరో రెండు చోట్ల మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఆదిలాబాద్ నుంచి 2019లో బీజేపీ నుంచి సోయం బాపురావు విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి తెలంగాణలో నలుగురు ఎంపీలుగా గెలిచారు. ఇందులో ముగ్గురికి మొదటి జాబితాలోనే టిక్కెట్ దక్కింది. రెండో జాబితాలో ఆదిలాబాద్ నుంచి మరొకరికి టిక్కెట్ ఇచ్చారు. ఈ రోజు విడుదల చేసిన 72 అభ్యర్థుల్లో దాద్రా నగర్ హవేలీ నుంచి 1, తెలంగాణ నుంచి 6, ఢిల్లీ నుంచి 2, గుజరాత్ నుంచి 7, హర్యానా నుంచి 6, హిమాచల్ ప్రదేశ్ నుంచి 2, కర్ణాటక నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 20, త్రిపుర నుంచి 1, ఉత్తరాఖండ్ నుంచి 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

More Telugu News