Kidney Stones: 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లు తొలగించిన హైదరాబాద్ డాక్టర్లు

  • హైదరాబాద్ ఏఐఎన్ యూ డాక్టర్ల ఘనత
  • కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు
  • 27 శాతం మాత్రమే పనిచేస్తున్న కిడ్నీ
  • కిడ్నీలో వందల సంఖ్యలో రాళ్లను గుర్తించిన వైద్యులు
  • పీసీఎన్ఎల్ చికిత్సా విధానం ద్వారా రాళ్ల తొలగింపు
AINU Hyderabad doctors removes 418 stones from kidney

కిడ్నీలో ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 418 రాళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్ యూ) వైద్యులు 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి వందల సంఖ్యలో రాళ్లను వెలికితీశారు. ఆ వృద్ధుడి కిడ్నీ 27 శాతం పనితీరు మాత్రమే కనబరుస్తున్నట్టు గుర్తించారు. 

కిడ్నీలో భారీ మొత్తంలో రాళ్లు ఉన్నప్పటికీ అత్యాధునిక పరికరాలతో కొద్దిపాటి శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా తొలగించినట్టు ఏఐఎన్ యూ డాక్టర్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్ తక్, డాక్టర్ దినేశ్ పాలుపంచుకున్నారు. 

శరీరంపై అతి తక్కువ కోతతో కిడ్నీలో రాళ్లను తొలగించే ఈ ఆధునిక వైద్య విధానం పేరు పెర్కటేనియస్ నెఫ్రోలిథోటమీ (పీసీఎన్ఎల్). ఈ విధానంలో లేజర్ ఆధారిత ప్రత్యేకమైన పరికరాలను కిడ్నీలోకి చొప్పిస్తారు. వీటిలో ఓ సూక్ష్మ కెమెరా కూడా ఉంటుంది. 

తద్వారా శస్త్రచికిత్స నిపుణులు తొలగించవలసిన భాగాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతారు. అందువల్ల శరీరంపై ఎక్కువ కోత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ తరహా శస్త్రచికిత్స అనంతరం రోగి కూడా త్వరగా కోలుకుంటాడు. అయితే, ఈ శస్త్రచికిత్సలో పాలుపంచుకునే వైద్యులు ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి. 

ఆవిష్కరణల రంగంలో నిజంగా ఇది విప్లవాత్మక విధానం అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిడ్నీ రాళ్ల బాధితులకు ఇది ఆశాదీపం వంటిదని ఏఐఎన్ యూ డాక్టర్లు అభివర్ణించారు.

More Telugu News