David Miller: డబ్బు కోసం డేవిడ్ మిల్ల‌ర్‌ పెళ్లి వాయిదా వేసుకున్నాడు: వ‌సీం అక్ర‌మ్

  • కెమిల్లా హారిస్‌ను ఈ నెల 10న‌ పెళ్లాడిన డేవిడ్ మిల్ల‌ర్
  • మిల్ల‌ర్‌కు 3మ్యాచుల కోసం ఫార్చూన్ బ‌రిష‌ల్ ఫ్రాంచైజీ రూ.1.24కోట్ల ఆఫ‌ర్
  • 'ది పెవిలియ‌న్' షోలో వెల్లడించిన వసీం   
South Africa Cricketer David Miller Postponed his Marriage for BPL offer says Wasim Akram

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన చిరకాల స్నేహితురాలు కెమిల్లా హారిస్‌ను ఈ నెల 10న‌ పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. కేప్ టౌన్‌లోని స్టెల్లెన్‌బోష్ న‌గ‌రంలోని ముర‌టీ వైన్ ఎస్టేట్‌లో కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల‌ మ‌ధ్య త‌మ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింద‌ని కెమిల్లా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. అయితే, పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ వ‌సీం అక్ర‌మ్.. డేవిడ్ మిల్ల‌ర్ వివాహంపై తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఈ పెళ్లి గ‌త నెల‌లోనే జ‌ర‌గాల్సింద‌ని, మిల్ల‌ర్ రూ. 1.24 కోట్ల బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ (బీపీఎల్‌) ఆఫ‌ర్ కోసం త‌న ప‌రిణ‌యాన్ని వాయిదా వేసుకున్న‌ట్లు ఈ లెజెండ‌రీ క్రికెటర్ పేర్కొన్నాడు. 

వ‌సీం అక్ర‌మ్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్) కార‌ణంగా బీపీఎల్‌ను ఫాలో కాలేక‌పోయాను. దీంతో స్నేహితుల ద్వారా బీపీఎల్ విజేత గురించి అడిగి తెలుసుకోవ‌డం జ‌రిగింది. ఈ స‌మ‌యంలోనే డేవిడ్ మిల్ల‌ర్ గురించి నాకు ఓ సంచ‌ల‌న విష‌యం తెలిసింది. అదే బీపీఎల్‌లో అత‌నికి ద‌క్కిన భారీ ఆఫ‌ర్‌. కేవ‌లం మూడు మ్యాచులు ఆడటానికి మిల్ల‌ర్‌కు ఫార్చూన్ బ‌రిష‌ల్ ఫ్రాంచైజీ రూ.1.24కోట్లు ఆఫ‌ర్ చేయ‌డం. దాంతో అత‌డు త‌న పెళ్లిని వాయిదా వేసుకుని మ‌రీ బీపీఎల్ ఆడాడు" అని వ‌సీం 'ది పెవిలియ‌న్' షో ద్వారా తెలిపాడు.  

ఇక ఇదే స్పోర్ట్స్ షో ద్వారా ఇంతకుముందు వ‌సీం అక్ర‌మ్ పాక్ ఆట‌గాడు అబ్దుల్లా ష‌ఫీక్‌పై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచాడు. పీఎస్ఎల్‌లో భాగంగా లాహోర్ ఖ‌లంద‌ర్స్‌, ఇస్లామాబాద్ యూనైటెడ్ మ్యాచ్‌లో ష‌ఫీక్ ఓ అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. కానీ, సెల‌బ్రేష‌న్స్ చేసుకోకుండా అభిమానుల‌ను నిశ్శబ్దంగా ఉండాల‌ని సంజ్ఞ చేశాడు. ఈ విష‌య‌మై వ‌సీం అక్ర‌మ్ మండిప‌డ్డాడు. పీఎస్ఎల్ కంటే ముందు ఆసీస్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అబ్దుల్లా ష‌ఫీక్ ఏకంగా 36 క్యాచులు జార‌విడిచిన విష‌యాన్ని గుర్తు చేశాడు. అతడు క్రికెట్ కంటే డ్రామాల్లో న‌టిస్తే బాగుంటుంద‌ని చుర‌క‌లు అంటించాడు.

More Telugu News