Twin Reservoirs: మరోసారి హైదరాబాద్ దాహార్తిని తీర్చనున్న జంట రిజర్వాయర్లు

  • జంట రిజర్వాయర్లతో ఇక పనిలేదన్న గత ప్రభుత్వం! 
  • అయితే, ఇప్పటికీ నగర ప్రజల నీటి అవసరాలు తీర్చుతున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్
  • జంట జలాశయాలను నిర్మించిన ఆఖరి నిజాం పాలకుడు 
Twin reservoirs ready to help this time too for Hyderabad

హైదరాబాద్ నగర భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఖరి నిజాం పాలకుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పేరిట జంట రిజర్వాయర్లను నిర్మించారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ రెండు రిజర్వాయర్లతో ఇక పనిలేదని గత ప్రభుత్వం భావించినా, ఇప్పుడా జంట రిజర్వాయర్లే ఈ వేసవిలో హైదరాబాద్ వాసుల గొంతు తడపనున్నాయి.  

హైదరాబాద్ నగర ప్రజల వినియోగం కోసం ఉస్మాన్ సాగర్ నుంచి ఏడాది పొడవునా 64 మిలియన్ లీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో, ఈ ఏడాది ఆరంభంలో హిమాయత్ సాగర్ నుంచి 7 మిలియన్ లీటర్ల నీటిని విడుదల చేయగా, ఇప్పుడా నీటి విడుదలను 13 మిలియన్ లీటర్లకు పెంచారు. 

గత కొన్నాళ్లుగా హైదరాబాద్ నీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడుతున్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఉపయోగించుకుంటూ నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ నగర రోజువారీ అవసరాల కోసం 1,254 మిలియన్ లీటర్ల నీటిని పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నారు. 

అయితే, సాగర్ డ్యామ్ లో నీటి మట్టం అంతకంతకుపడిపోతోంది. సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా, మార్చి 11 నాటికి 514 అడుగుల మేర నీటిమట్టం ఉంది. గతేడాది అదే తేదీ నాటికి సాగర్ లో 539.3 అడుగుల నీటిమట్టం ఉంది. గతేడాదితో పోల్చితే నీటి లభ్యత కూడా తగ్గిపోవడంతో, హైదరాబాద్ జంట రిజర్వాయర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేసీఆర్ సర్కారు నిరుపయోగం అని భావించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలే ఈసారి కూడా హైదరాబాద్ నీటి కొరతను తీర్చనున్నాయి. 

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ బీ) దీనిపై స్పందిస్తూ... నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నిత్యం 270 గ్యాలన్ల నీటిని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు, కృష్ణా తాగు నీటి పథకం 1,2,3 ఫేజ్ లకు పంపింగ్ చేస్తున్నామని వెల్లడించింది. 

జులై చివరి వరకు నీటి అవసరాలు తీర్చేలా అత్యవవసర నీటి పంపింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని, నీటి మట్టం డెడ్ స్టోరేజికి చేరుకోగానే అత్యవసర నీటి పంపింగ్ మొదలవుతుందని బోర్డు తెలిపింది. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి అత్యవసర పంపింగ్ కు ఏర్పాట్లు చేశామని, అదనపు జలాల కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట రిజర్వాయర్లు ఉండనే ఉన్నాయని అధికారులు వివరించారు. అదే సమయంలో సింగూరు, మంజీర జలాశయాల్లో నీటి మట్టాలు  కూడా సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.

More Telugu News