Yashaswi Jaiswal: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీని అధిగమించిన యువ సంచలనం యశస్వి జైస్వాల్

  • టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకిన యువ క్రికెటర్
  • 9వ స్థానానికి పడిపోయిన కింగ్ విరాట్ కోహ్లీ
  • 5 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకింగ్ దక్కించుకున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ
  • అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్
Young Batsman Yashaswi Jaiswal overtakes Virat Kohli in ICC Test rankings

భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా టాప్-10 బ్యాట్స్‌మెన్ల జాబితాలోకి దూసుకొచ్చి 8వ ర్యాంకులో నిలిచాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడకపోవడంతో విరాట్ 9వ స్థానానికి దిగజారాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో పలు కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకులో నిలిచాడు. 

ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ స్థానం మెరుగుదలకు దోహదపడింది. వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదడంతో పాటు సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో విరాట్ కోహ్లీ అన్ని టెస్టులకూ దూరమవ్వడంతో ర్యాంక్ దిగజారింది. ఇక ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవలే 100వ టెస్టు మ్యాచ్ ఆడిన విలియమ్సన్ 859 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

ముఖ్యంగా, న్యూజిలాండ్ పర్యటనలో ఓపెనర్‌గా రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన స్టీవ్ స్మిత్ ఐదో స్థానానికి పడిపోయాడు. భారత్‌తో సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడకపోయినప్పటికీ పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ 3వ స్థానం, కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ 4వ ర్యాంకులో నిలిచారు.

బ్యాట్స్‌మెన్ల ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
1 - కేన్ విలియమ్సన్ ( 859 రేటింగ్ పాయింట్లు)
2 - జో రూట్ (824)
3 - బాబర్ ఆజం (768)
4 - డారిల్ మిచెల్ (768)
5 - స్టీవ్ స్మిత్ (757)
6 - రోహిత్ శర్మ (751)
7 - కరుణరత్నే (750)
8 - యశస్వి జైస్వాల్ (740)
9 - విరాట్ కోహ్లీ (737)
10 - హ్యారీ బ్రూక్ (735)


More Telugu News