Pat Cummins: హైదరాబాద్ చేరుకున్న ప్యాట్ కమిన్స్... సన్ రైజర్స్ శిబిరంలో జోష్

Pat Cummins arrives Hyderabad as SRH on full swing
  • మార్చి 22 నుంచి ఐపీఎల్ కొత్త సీజన్
  • ఈ సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ 
  • ఇప్పటికే సాధన ప్రారంభించిన సన్ రైజర్స్ ఆటగాళ్లు
  • జట్టుతో కలిసిన కమిన్స్
  • మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్ జట్టు
ఐపీఎల్-17 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సరికొత్తగా ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కొత్త కోచ్ వెటోరీల కాంబినేషన్ తో తమ భాగ్యరేఖ మారుతుందని సన్ రైజర్స్ యాజమాన్యం ఆశాభావంతో ఉంది. ఐపీఎల్ కొత్త సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా, సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. 

ఇప్పటికే సన్ రైజర్స్ శిబిరం కసరత్తులు ప్రారంభించింది. ఆటగాళ్లు హైదరాబాద్ లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ ఆసీస్ స్టార్ ఇవాళే సన్ రైజర్స్ జట్టుతో కలిశాడు. కమిన్స్ రాకతో ఎస్ఆర్ హెచ్ శిబిరంలో మరింత హుషారు నెలకొంది. 

గతేడాది ఆసీస్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ అపురూప విజయాలు అందించాడు. టెస్టు చాంపియన్ షిప్, టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ విజయాలతో ఆసీస్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ సన్ రైజర్స్ ను అందలం ఎక్కిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

అయితే, కమిన్స్ గతంలో ఐపీఎల్ లో పలు ఫ్రాంచైజీలకు ఆడినా, పెద్దగా రాణించింది లేదు. అయినప్పటికీ, అతడి ఇంటర్నేషనల్ రికార్డును దృష్టిలో ఉంచుకున్న సన్ రైజర్స్ యాజమాన్యం ఐపీఎల్ వేలం చరిత్రలోనే తొలిసారిగా రూ.20.50 కోట్ల అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది. మరి కమిన్స్ ఆ ధరకు న్యాయం చేస్తాడా అన్న ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాలి.
Pat Cummins
SRH
Hyderabad
IPL
Australia

More Telugu News