Smita Sabharwal: మంత్రి సీతక్క ఎదుట కాలుమీద కాలేసుకుని కూర్చున్న ఘటనపై వివాదం.. స్మితా సభర్వాల్ వివరణ

  • సీతక్కతో సమావేశంలో కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ఐఏఎస్ అధికారిణి
  • అలా కూర్చోవడం తనకు సౌకర్యంగా ఉంటుందన్న స్మిత
  • 47 ఏళ్ల వయసులో తాను ఎలా కూర్చోవాలో, ఎలా నిల్చోవాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని ఆగ్రహం
  • వివాదం మీడియా సృష్టేనన్న స్మిత
  • ఎలా కూర్చోవాలో రాజ్యాంగంలో ఏమీ రాసిలేదు కదా అని సెటైర్
Smita Sabharwal reacts on trolls over Seethakka issue

మంత్రి సీతక్కతో సమావేశం సందర్భంగా కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడంపై వస్తున్న ట్రోల్స్‌కు ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ఫుల్‌స్టాప్ పెట్టారు. అది మీడియా సృష్టి తప్ప మరోటి కాదని తేల్చిచెప్పారు. తనకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా కూర్చుంటానని స్ఫష్టం చేశారు. తన వయసు ఇప్పుడు 47 సంవత్సరాలని, ఈ వయసులో ఎలా కూర్చోవాలో, ఎలా నిల్చోవాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. నిజానికి అందులో ఎలాంటి వివాదమూ లేదని, ఎవరో ఫొటోగ్రాఫర్ దానిని క్లిక్ మనిపిస్తే మరెవరో దానిని ట్రోల్ చేశారని, ఒకరకంగా ఈ వివాదానికి మీడియానే కారణమని నిందించారు.

వివాదం మొదలైంది ఇలా 
ఇంతకీ వివాదం ఏంటంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక మంత్రి సీతక్కతో స్మితా సభర్వాల్ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎదురుగా ఆమె కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఓ ఆదివాసీ నాయకురాలితో ప్రవర్తించేది ఇలాగేనా? అంటూ మండిపడ్డారు. ఇది అహంకారం తప్ప మరోటి కాదని దుయ్యబట్టారు.

అలాంటి నిబంధన ఉంటే పద్ధతి మార్చుకుంటా
ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన స్మితా సభర్వాల్ ఆ ట్రోల్స్‌కు ముగింపు పలికారు. అలా కూర్చోవడం తన ఆహార్యం తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు. కాదూ.. అలా కూర్చోకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉంటే చెబితే తన పద్ధతి మార్చుకుంటానని సెటైర్ వేశారు. ఉద్యోగానికి, అధికారానికి మాత్రమే గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని స్మితా సభర్వాల్ తేల్చిచెప్పారు.

More Telugu News