Hyderabad Liberation Day: ఇకపై హైదరాబాద్ విమోచన దినంగా సెప్టెంబర్ 17.. కేంద్రం గెజిట్ విడుదల

  • దేశ స్వాతంత్ర్యానంతరం 13 నెలల పాటు హైదరాబాద్ రాష్ట్రంలో నిజామ్ పాలన సాగిందన్న కేంద్రం
  • ఆపరేషన్ పోలోతో హైదరాబాద్‌ దేశంలో విలీనమైందని వెల్లడి
  • అమరుల జ్ఞాపకార్థం హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నట్టు ప్రకటన
Centre to celebrate September 17 as Hyderabad Liberation Day every year

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. 1947లో ఆగస్టు 15న దేశానికంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం 13 నెలల పాటు నిజామ్ పాలన ఉందని పేర్కొంది. పోలీస్ చర్య తరువాత సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. హైదరాబాద్ విమోచన దినం జరపాలన్న డిమాండ్ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అమరుల జ్ఞాపకార్థం, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు హైదరాబాద్ విమోచన దినం జరుపుకునేందుకు నిర్ణయించినట్టు గెజిట్‌లో హోం శాఖ పేర్కొంది. 
 
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినంగా నిర్వహించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ విమోచన దినం నిర్వహించనందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను విమర్శించారు. 

గత రెండు సంవత్సరాలుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.. హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తోంది. ఆ వేడుకల్లో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారామిలిటరీ దళాల కవాతును వీక్షించారు. అయితే, ఓటుబ్యాంకు రాజకీయాలు కోసం హైదరాబాద్ విమోచన దినం జరుపుకోకపోవడం విషాదమని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నేషనల్ ఇంటిగ్రేషన్ డే నిర్వహించింది.

More Telugu News