Praveen Kumar: దేశం కోసం ఆడ‌టం హార్దిక్ పాండ్యాకు ఇష్టం ఉండ‌దు.. అత‌నికి డ‌బ్బే ముఖ్యం: ప్ర‌వీణ్ కుమార్‌

  • క్రికెట‌ర్లు త‌ప్ప‌కుండా దేశవాళీ క్రికెట్‌ ఆడాల‌న్న‌ ప్ర‌వీణ్ కుమార్
  • డ‌బ్బు కోసం అంద‌రూ ఐపీఎల్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వ‌జం
  • రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ
  • 2022లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన స్టార్ ఆల్‌రౌండర్  
Praveen Kumar slams Mumbai Indians captain Hardik Pandya

ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి హార్దిక్ అర్హతలు, సుముఖతను ఈ సంద‌ర్భంగా ప్రవీణ్ ప్రశ్నించాడు.

"ఐపీఎల్‌కు రెండు నెలల ముందు మీరు గాయపడ్డారు. మీరు దేశం కోసం ఆడరు. మీరు దేశవాళీ క్రికెట్‌లో మీ రాష్ట్రం కోసం ఆడరు. నేరుగా ఐపీఎల్‌లో ఆడండి. డబ్బు సంపాదించండి. దానిలో తప్పు లేదు. కానీ మీరు రాష్ట్రం, దేశం కోసం ఆడాలి. ఇప్పుడు అంద‌రూ ఐపీఎల్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు" అని ప్రవీణ్ తెలిపాడు.

కాగా, వ‌న్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా అక్టోబరు 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌కు చీలమండ గాయం అయింది. అప్ప‌టి నుంచి అత‌డు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు నేరుగా ఐపీఎల్‌లో బ‌రిలోకి దిగుతున్నాడు. అది కూడా ఈసారి ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా ప్ర‌మోట్ కావ‌డం విశేషం. హార్దిక్ సోమవారం (మార్చి 11) ముంబై ఫ్రాంచైజీలో చేరాడు. అలాగే ప్రాక్టీస్ కూడా మొద‌లెట్టాడు. కాగా, పాండ్యా 2021 తర్వాత మొదటిసారిగా ముంబై ఇండియన్స్‌ నెట్స్‌కి తిరిగి వచ్చాడు. 2021లో జరిగిన మెగా వేలంలో ఫ్రాంచైజీ హార్దిక్‌ను వ‌దిలేసింది. దాంతో గుజ‌రాత్ టైటాన్స్ తీసుకోవ‌డంతో పాటు సార‌థిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

రెండు సీజ‌న్లు (2022, 2023) హార్దిక్ పాండ్యా గుజ‌రాత్‌కు ఆడాడు. ఈ రెండుసార్లు గుజ‌రాత్ జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చ‌డంతో పాటు ఒక‌సారి టైటిల్ కూడా అందించాడీ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు ముంబై కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.

ఈ విష‌యమై కూడా ప్ర‌వీణ్ కుమార్ స్పందించాడు. ఫ్రాంచైజీ తన కెప్టెన్‌గా రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయడానికి బదులుగా అతనినే కొనసాగించి వుంటే బాగుండేదని ప్రవీణ్ తెలిపాడు.

"అవును, రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా చేయగలడు. ఒక సంవత్సరం మాత్రమే కాదు, అతను రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు చేయగలడు. కానీ చివరికి నిర్ణయం యాజమాన్యం చేతిలో ఉంది" అని ప్ర‌వీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ సార‌థ్యంలోని ముంబై ఇండియన్స్ మార్చి 24న‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్‌ తలపడనుంది.

More Telugu News