Revanth Reddy: నేనేం పాపం చేశానని... కేసీఆర్, కేటీఆర్, కవితలు ఆ మాట అంటున్నారు?: రేవంత్ రెడ్డి

Revanth Reddy lashes out at kcr ktr and kavitha
  • ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎందుకు అంటున్నారని నిలదీత
  • ప్రభుత్వాన్ని పడగొడతామనే నేతలను చీపుర్లతో కొట్టి పంపించాలని మహిళలకు పిలుపు
  • మహిళా సంఘాల్లోని సభ్యులను కోటీశ్వరులను చేసే బాధ్యత తమదేనని హామీ
కేసీఆర్, కేటీఆర్, కవితలు తన ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు... అంత పాపం నేనేం చేశాను? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. వారి అవినీతి సొమ్ములో షేర్ అడిగానా? ప్రభుత్వాన్ని పడగొడతానని ఎందుకు అంటున్నారని నిలదీశారు. మంగళవారం 'మహిళా శక్తి' సభలో ఆయన మాట్లాడుతూ... సోనియా గాంధీపై నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పే నేతలను మహిళలు అందరూ చీపుర్లతో తిరగేసి కొట్టి పంపించాలన్నారు. 

మోదీ, కేసీఆర్ కలిసి గ్యాస్ ధరలు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును నా నెత్తిన పెట్టి వెళ్లారని విమర్శించారు. సంసారాన్ని చక్కదిద్దుకుంటూ... ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని పదేళ్ల పాటు ఆశ చూపి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.

మహిళా సంఘాల్లోని సభ్యులను కోటీశ్వరులను చేసే బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి అన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఇది చూసి కేసీఆర్ కుటుంబానికి కడుపు మంటగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆటో డ్రైవర్లతో ధర్నా చేయించారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్‌ను తక్కువ ధరకే ఆడపడుచులకు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆత్మబలిదానాలు చూసిన సోనియమ్మ చలించిపోయి తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ఏ తల్లీ బిడ్డను కోల్పోవద్దని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే బాధ సోనియమ్మకు తెలుసునన్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News