Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన 'హను మాన్' టీమ్

Hanu Man team met union minister Amit Shah in Hyderabad
  • హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా
  • ఓ హోటల్ లో బీజేపీ అగ్రనేతను కలిసిన తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ
  • అమిత్ షాకు హనుమంతుడి ప్రతిమ బహూకరణ 
సంక్రాంతి సీజన్ లో రిలీజై బాక్సాఫీసు వద్ద వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం 'హను మాన్'. తేజా సజ్జా ప్రధాన పాత్రలో, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. చిన్న సినిమాగా రిలీజైనా... ఆకట్టుకునే కథాంశం, అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

తాజాగా, 'హను మాన్' చిత్ర బృందం హైదరాబాద్ లో కేంద్రమంత్రి అమిత్ షాను కలిసింది. హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ హైదరాబాదులోని ఓ హోటల్లో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనకు హనుమంతుడి ప్రతిమను బహూకరించారు. అనంతరం ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మరో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి  కూడా పాల్గొన్నారు. 

అమిత్ షాను కలవడంపై ప్రశాంత్ వర్మ ఎక్స్ లో స్పందించారు. కిషన్ రెడ్డి గారితో వెళ్లి అమిత్ షాను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. "హను మాన్ చిత్రం గురించి మీ ప్రోత్సాహం, మీ మంచి మాటలు మాకెంతో సంతోషం కలిగించాయి సర్... మిమ్మల్ని కలవడం మాకెంతో ఆనందదాయకం. థాంక్యూ అమిత్ షా గారు" అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. 

తేజా సజ్జా కూడా అమిత్ షాను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Amit Shah
Hanu Man
Teja Sajja
Prashant Varma
Hyderabad
BJP
Tollywood

More Telugu News