Google: ఎన్నిక‌ల్లో త‌ప్పుడు స‌మాచారాన్ని నివారించేందుకు.. ఈసీతో జ‌ట్టు కట్టిన గూగుల్

  • అధీకృత స‌మాచారం మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా గూగుల్ చ‌ర్య‌
  • ఇంగ్లీష్, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి స‌మాచారం
  • డీప్‌ఫేక్‌, మార్ఫింగ్ చేసిన మీడియాను క‌ట్ట‌డి చేసిన గూగుల్‌
  • ఏఐ జెమినిపై విమ‌ర్శ‌లు.. ఎన్నిక‌ల‌ సంబంధిత‌ స‌మాచారం ఇవ్వ‌కుండా గూగుల్ ఆంక్ష‌లు 
  • ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసే త‌ప్పుడు స‌మాచారంపై ప్ర‌త్యేక విధానాలు
  • ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లపై క‌ఠిన నిబంధ‌న‌ల అమ‌లు
Google ties up with ECI to prevent spread of false information

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌ప్పుడు స‌మాచారాన్ని నివారించే దిశ‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో గూగుల్ జ‌ట్టు క‌ట్టింది. ఎన్నిక‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త కోసం ఈ కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు గూగుల్ తెలిపింది. దీనిలో భాగంగా త‌ప్పుడు స‌మాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు అధీకృత స‌మాచారం మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా చూడ‌డం, ఏఐని ఉప‌యోగించి రూపొందించే వీడియోల‌కు లేబుల్ వేయ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టింది. 

ఓట‌రుగా పేరు న‌మోదు ఎలా? ఎలా ఓటు వేయాలి? వంటి స‌మాచారాన్ని చాలా సులువుగా తెలుసుకోవ‌డం కోసం ఈసీతో జ‌ట్టు క‌ట్టిన‌ట్లు గూగుల్ పేర్కొంది. ఇంగ్లీష్, హిందీ భాష‌ల్లో ఈ స‌మాచారం అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది. డీప్‌ఫేక్‌, మార్ఫింగ్ చేసిన మీడియాను క‌ట్ట‌డి చేసిన‌ట్లు పేర్కొంది. అలాగే యూట్యూబ్‌లోని ఏఐ ఫీచ‌ర్ల‌తో రూపొందిన కంటెంట్‌కు ఇప్ప‌టికే లేబుల్ వేయ‌డం ప్రారంభించినట్లు గూగుల్ తెలియ‌జేసింది. ఇక గూగుల్‌కు చెందిన ఏఐ జెమినిపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన స‌మాచారం ఇవ్వ‌కుండా గూగుల్ ఆంక్ష‌లు విధించింది. 

అలాగే యూట్యూబ్, గూగుల్ సెర్చ్‌లో ఎన్నిక‌ల‌కు సంబంధించిన వార్త‌లు, స‌మాచారం కూడా అధీకృత వేదిక‌ల నుంచే డిస్‌ప్లే అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పింది. దీంతో పాటు ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసే త‌ప్పుడు స‌మాచారం, హింస‌ను ప్రేరేపించేవి, విద్వేష వ్యాఖ్య‌ల విష‌యంలో విధానాలు రూపొందించిన‌ట్లు పేర్కొంది. చివ‌రికి ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల మీదా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్లు గూగుల్ త‌న బ్లాక్ పోస్టు ద్వారా చెప్పుకొచ్చింది.

More Telugu News