Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ కేడర్‌కు మేం వ్యతిరేకం కాదు... కానీ: బండి సంజయ్ వ్యాఖ్య

  • ఆ పార్టీల నాయకత్వంతో మాత్రమే విభేదిస్తామన్న బండి సంజయ్
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్య
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయిందన్న బండి సంజయ్
  • బరాబర్ రాముడి పేరు చెప్పుకుంటామని స్పష్టీకరణ
Bandi Sanjay says bjp is not against brs and congress cadre

బీజేపీ ఎప్పుడూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కేడర్‌కు వ్యతిరేకం కాదని... ఆ పార్టీల నాయకత్వంతో మాత్రమే విభేదిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాకుండా కాంగ్రెస్‌ను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారన్నారు. తమ కోసం కొట్లాడింది బీజేపీ... ఆ పార్టీ కార్యకర్తలు అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించామని ఆవేదన చెందుతున్నారన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే బాగుండేదని ఇప్పుడు అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, మోదీని బలపరచాలని భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల ఆలోచన కూడా అలాగే ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్‌ల బతుకులు బర్బాత్ అయ్యాయని... కాంగ్రెస్ పాలన వచ్చినా ఏమాత్రం లాభం లేదన్నారు. బీఆర్ఎస్ ఇక్కడ లేదు... అక్కడా లేదని తెలిపారు.

ఆ ప్రచారంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసి అందులో సక్సెస్ అయిందని బండి సంజయ్ అన్నారు. అందుకే ప్రజలు ఆ పార్టీని గెలిపించారన్నారు. కానీ అలాంటి అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించరని గ్రహించిన కాంగ్రెస్ మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని విమర్శించారు.

బరాబర్ రాముడి పేరు చెప్పుకుంటాం

బీజేపీ బరాబర్ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుందని బండి సంజయ్ అన్నారు. రాముడి గురించి చెప్పేది మేం... రామాలయం కట్టింది మేం... కాబట్టి కచ్చితంగా అడుగుతామన్నారు. రాముడి కోసం కొట్లాడింది... బలిదానం చేసింది బీజేపీ కార్యకర్తలని పేర్కొన్నారు. మా వెనుక రాముడు ఉన్నాడు... రాముడి వారసుడు ప్రధాని మోదీ ఉన్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. కనీసం వారు రాహుల్ గాంధీ ఫొటోనే పెట్టుకోవడం లేదు... ఇక ఎవరిని చూసి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎద్దేవా చేశారు.

100 రోజులు అయ్యాక ప్రజలు చుక్కలు చూపిస్తారు

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కోసం 100 రోజుల సమయం తీసుకున్నారని... ఈ గడువు తీరాక ప్రజలు అధికార పార్టీకి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. ఆగు బిడ్డా... వంద రోజుల తర్వాత ప్రజలు ఊళ్లలో మిమ్మల్ని నిలదీస్తారని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అంటే 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వడం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మాత్రమే కాదన్నారు. అన్ని హామీలు నెరవేర్చాలన్నారు.

More Telugu News