Indian military: మాల్దీవుల నుంచి తొలి విడత భారత సైనికుల బృందం ఉపసంహరణ

First batch of Indian military personnel leaves Maldives amid strained ties
  • అడ్డూ నగరం నుంచి 25 మంది సైనికుల బృందం   వెళ్లిపోయిందన్న మాల్దీవుల మీడియా
  • నిర్ధారించిన మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్
  • మే 10 లోగా అక్కడి నుంచి వచ్చేయనున్న మిగతా భారత సైనిక బృందం
భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు సన్నగిల్లిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ భూభాగం నుంచి భారత్ తన సైనిక సిబ్బందిని ఉపసహరించుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు స్పష్టం చేసిన నేపథ్యంలో తొలి విడత బృందం మాల్దీవుల నుంచి వచ్చేసింది. తొలి విడత బృందం ఉపసంహరణ గడువు మార్చి 10గా ఉండడంతో 25 మందితో కూడిన భారత సైనిక బృందం బయలుదేరి వెళ్లిపోయిందని మాల్దీవుల మీడియా పేర్కొంది. అడ్డూ నగరంలో మోహరించిన బృందం వెళ్లిపోయిందంటూ మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ నిర్ధారించినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మానవతా సాయం కోసం ఇంతకాలం ఉపయోగించిన హెలికాఫ్టర్ల కార్యకలాపాలను కొత్తగా నియమించుకున్న బృందానికి అప్పగించినట్టుగా వివరించాయి. కాగా భారత్ సాయంగా అందించిన ఈ హెలీకాఫ్టర్లను మెడికల్ సేవలు లేదా విపత్తు సమయాల్లో నిర్వహించేందుకు భారత్‌కే చెందిన పౌర బృందాన్ని మాల్దీవులు ప్రభుత్వం నియమించుకున్న విషయం తెలిసిందే.

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద ముయిజ్జు చైనా అనుకూల వైఖరి కారణంగా భారత సైనిక సిబ్బందిని ఆ దేశం నుంచి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే భారత సైనిక సిబ్బంది దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మే 10 లోగా ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీంతో గడువులోగా మిగతా సైనిక బృందం కూడా అక్కడి నుంచి వచ్చేయనుంది. కాగా మాల్దీవులకు భారత్ ఒక డోర్నియర్ 228 సముద్ర గస్తీ విమానం, రెండు హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లను సాయంగా అందించింది. అంతేకాదు 88 మంది సైనిక సిబ్బందితో ఆ దేశానికి చాలా కాలం సేవలు కూడా అందించింది.
Indian military
Maldives
India
Maldives National Defence Force

More Telugu News