Amit Shah: దానికి సమాధానం చెప్పాక, బీజేపీని విమర్శించు: రేవంత్ రెడ్డిపై అమిత్ షా మండిపాటు

  • పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని అమిత్ షా ధీమా
  • బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శ
  • తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని వెల్లడి
  • రాహుల్ గాంధీ ఇటలీలో సేద తీరుతుంటారని ఎద్దేవా
Amit Shah challenges CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను కాంగ్రెస్ అవినీతి జాబితాను పంపిస్తానని... కాంగ్రెస్ అవినీతిపై సమాధానం చెప్పాక ఆయన బీజేపీపై విమర్శలు చేయాలని బీజేపీ ఆగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో లోక్ సభ షెడ్యూల్ రానుందన్నారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం రూ.10వేల కోట్ల సాయం చేసిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 స్థానాలు గెలవడం ఖాయమన్నారు.

మూడు పార్టీలు ఒక్కటే

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ... మూడూ ఒక్కటేనని విమర్శించారు. మూడు పార్టీల జెండా, అజెండా ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ చేతిలో కీలుబొమ్మలు అని ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు కలిసే తెలంగాణలో పని చేస్తున్నాయన్నారు. మోదీని, బీజేపీని ఓడించడమే వారి లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు. తాము అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఖాయమన్నారు. 

ఆ మూడు అవినీతి పార్టీలు

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని అమిత్ షా విమర్శలు గుప్పించారు. మోదీ మాత్రం ఎలాంటి అవినీతి లేని పాలన అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై వేలకోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. అందుకే దేశ ప్రజలు మరోసారి ప్రధానిగా మోదీనే కోరుకుంటున్నట్లు చెప్పారు. రైతులు, ఉద్యోగులు, కూలీలు... ఇలా ఎవరి వద్దకు వెళ్లినా మోదీ.. మోదీ అంటున్నారని పేర్కొన్నారు. మరోసారి మోదీ గెలిస్తే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పారు.

అయోధ్యలో మనం భవ్యరామమందిరం నిర్మించుకున్నామన్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ స్థిరమైన, అవినీతికి తావులేని పాలనను అందించారన్నారు. పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళలకు 33 రిజర్వేషన్ అమలు ఇలా ఎన్నో చేశామన్నారు. సీఏఏను అమలులోకి తీసుకు వచ్చామని, కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు నాగరికత లేదని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రతి మూడు నెలలకు 45 రోజులు రాహుల్ గాంధీ సెలవు తీసుకుంటారని ఎద్దేవా చేశారు. సేద తీరేందుకు ఇటలీకి వెళతారన్నారు.

పాకిస్థాన్ నుంచి చొరబాట్లను తిప్పికొట్టింది మోదీ ప్రభుత్వమే అన్నారు. పాక్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని మోదీ అంతం చేశారని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ విశ్వగురువుగా నిలుస్తుందన్నారు. 23 ఏళ్ళలో ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోదీ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదన్నారు.

More Telugu News