Donald Trump: అధ్య‌క్షుడిగా ఎన్నికైతే డొనాల్డ్ ట్రంప్ చేసే మొద‌టి ప‌ని అదేన‌ట‌..!

  • రిప‌బ్లికన్ పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి అధ్య‌క్ష బ‌రిలోకి డొనాల్డ్ ట్రంప్
  • క్యాపిట‌ల్ భ‌వ‌నంపై దాడిలో అరెస్ట‌యిన వారిని విడిపిస్తాన‌న్న మాజీ అధ్య‌క్షుడు
  • 2021 జ‌న‌వ‌రి 6న క్యాపిట‌ల్ భ‌వ‌నంపై ట్రంప్‌ మ‌ద్ద‌తుదారుల దాడి
  • అమెరికా చ‌రిత్ర‌లో మాయ‌నిమ‌చ్చ‌గా మిగిలిన ఘ‌ట‌న‌
Donald Trump says he will free us Capitol Rioters

వ‌చ్చే న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లికన్ పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే, తాజాగా ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ఈసారి తాను అధ్య‌క్షుడిగా ఎన్నికైతే మొద‌ట చేసే ప‌నిలో 2021లో క్యాపిట‌ల్ భ‌వ‌నంపై జ‌రిగిన దాడిలో అరెస్ట‌యి జైలు కెళ్లిన వారిని విడిపించ‌డం ఉంటుంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా జైలులో శిక్ష అనుభ‌విస్తున్న వారిని ఆయ‌న బందీలుగా పేర్కొన్నారు. 

'స‌రిహ‌ద్దుల‌ను మూసివేయ‌డం, అన్యాయంగా జైల్లో పెట్టిన జ‌న‌వ‌రి 6 బందీల‌ను విడిపించ‌డం.. మీ త‌దుప‌రి అధ్యక్షుడిగా నేను తీసుకునే తొలి నిర్ణ‌యాలు' అని త‌న ట్రూత్ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

ఇక 2021 జ‌న‌వ‌రి 6వ తేదీన క్యాపిట‌ల్ భ‌వ‌నంపై ట్రంప్‌ మ‌ద్ద‌తుదారులు విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. జో బైడెన్ విజ‌యాన్ని ధ్రువీక‌రించ‌డానికి కాంగ్రెస్ స‌మావేశమైన స‌మ‌యంలో వేలాది మంది డొనాల్డ్ ట్రంప్ మద్ద‌తుదారులు భ‌వ‌నంలోకి చొర‌బ‌డ్డారు. భ‌వ‌నంలో బీభ‌త్సం సృష్టించారు. ఈ ఘ‌ట‌న అమెరికా చ‌రిత్ర‌లో మాయ‌నిమ‌చ్చ‌గా మిగిలిపోయింది. ఈ కేసులో ట్రంప్ పై నేరాభియోగాలు కూడా న‌మోద‌య్యాయి. కానీ, ట్రంప్ వాటిని తోసిపుచ్చారు. పైగా డెమోక్రాట్లు త‌న‌పై కావాల‌ని త‌ప్పుడు కేసు పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కాగా, ట్రంప్ క్యాపిటల్‌ భ‌వ‌నంపై దాడికి పాల్ప‌డిన వారిని విడిపిస్తాన‌ని ఇంత‌కుముందు కూడా ప‌లుమార్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

More Telugu News