Karimnagar District: కరీంనగర్ నుంచి రేపు కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం: వినోద్ కుమార్

  • రేపు సాయంత్రం 4 గంటలకు ఎస్ఆర్ఆర్ మైదానంలో బహిరంగ సభ ఉంటుందన్న మాజీ ఎంపీ
  • పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీల అవసరం ఏమిటో రేపు కేసీఆర్ చెబుతారన్న వినోద్ కుమార్
  • కేసీఆర్ సీఎం అయి ఉంటే మేడిగడ్డ పనులు ప్రారంభించి ఉండేవారని వెల్లడి
Vinod Kumar talks about karimnagar public meeting

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ వెల్లడించారు. రేపు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ మైదానంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు సంబంధించి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా జ‌ర‌గ‌బోయే ఈ క‌ద‌న‌భేరికి భారీగా కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, ప్ర‌జ‌లు త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో ఎస్ఆర్ఆర్ మైదానం నుంచి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు.

పార్ల‌మెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన‌ట్లే... గ‌త పదేళ్లలో కేంద్రంపై పోరాటం చేసి తెలంగాణ హ‌క్కుల‌ను సాధించుకున్నామన్నారు. ఢిల్లీలో బీజేపీ, తెలంగాణ‌లో కాంగ్రెస్ వున్నాయని, ఇక బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు? అని కొంద‌రు ప్రశ్నిస్తున్నారని... వారికి కేసీఆర్ దీటుగా స‌మాధానం చెబుతారన్నారు. ఎందుకంటే గులాబీ జెండా ఎంపీలు పార్ల‌మెంట్‌లో త‌మ గ‌ళాన్ని విప్పి ఎన్నో సాధించుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అవశ్యకత మరింత ఉందన్నారు. తెలంగాణ స్పృహ, సోయి ఉండాల్సిన ఎంపీలు ఢిల్లీలో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి మూడు నెల‌లు దాటిందని... కానీ మేడిగడ్డలో ఇప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ గెలిచి ఉంటే కనుక ఇప్పటికే మేడిగడ్డ పనులు ప్రారంభించి ఉండేవారన్నారు. మిడ్ మానేరు, ఎల్ఎండీ నింపుకుని పంట పొలాల‌కు నీళ్లు ఇచ్చేవాళ్లమని... తెలంగాణ గుండెతో ఆలోచిస్తేనే స‌మ‌స్య‌లు అర్థ‌మ‌వుతాయన్నారు. ప్ర‌జ‌ల‌కు ఏది అత్య‌వ‌స‌రమనేది ఆలోచించాలని... పంట పొలాలు ఎడిపోతుంటే రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఉంటే అడ్డుప‌డైనా నీళ్లు తీసుకోచ్చేవార‌ని రైతులు అంటున్నారన్నారు. కాంగ్రెస్ రైతులకు సాగునీరు ఇవ్వలేకపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గులాబీ జెండా ఎగరాలన్నారు.

More Telugu News