Agni-5: భారత్ అగ్ని-5 ప్రయోగం చేపట్టిన వేళ... విశాఖపట్నం సమీపానికి వచ్చిన చైనా నౌక

China ship anchored near Vizag port while India hold Agni 5 missile test
  • అగ్ని-5 ప్రయోగం చేపట్టిన భారత్
  • విశాఖపట్నంకు 480 కి.మీ దూరానికి చేరువగా వచ్చిన చైనా నౌక 
  • అనుమానం కలిగిస్తున్న చైనా నౌక తీరు 
భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేసేలా అగ్ని-5 క్షిపణి మొదటి ప్రయోగంలోనే అంచనాలను అందుకుంది. అణ్వస్త్రాలను మోసుకుపోయే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణి పరీక్షను ఒడిశా సమీపంలోని ఓ దీవిలో విజయవంతంగా  నిర్వహించారు. అయితే, భారత్ తన రక్షణ పాటవాన్ని చాటుకున్న సమయంలోనే చైనాకు చెందిన ఓ పరిశోధన నౌక భారత ప్రాదేశిక జలాలకు సమీపంలోకి రావడం కలకలం రేపింది. 

చైనాకు చెందిన జియాన్ యాంగ్ హాంగ్ 01 నౌక ఏపీలోని విశాఖపట్నం తీరానికి 480 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో లంగరు వేసింది. భారత్ కు చెందిన మూడు అణు బాలిస్టిక్ మిసైల్ సహిత జలాంతర్గాములు, పలు కీలక ఆయుధ వ్యవస్థలకు స్థావరంగా ఉన్న విశాఖ నావల్ బేస్ కు సమీపానికి చైనా నౌక రావడం భారత్ ను అప్రమత్తం చేసింది. 

గత కొంతకాలంగా హిందూ మహా సముద్రం, బంగాళాఖాతంలో చైనా నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయి. చైనా పరిశోధక నౌకల పేరిట భారత్ పై నిఘా వేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా అగ్ని-5 క్షిపణి ప్రయోగం చేపట్టే సమయంలోనే చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01 భారత తీరానికి చేరువలోకి రావడం అనుమానాలను బలపరుస్తోంది. 

ఈ నౌక మలక్కా జలసంధి దాటి దిశ మార్చుకుని బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే ఆగ్నేయ బంగాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. సముద్ర గర్భంలో 10 వేల అడుగుల లోతులోనూ పరిశోధించగల అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు ఈ నౌకలో ఉన్నట్టు భావిస్తున్నారు.
Agni-5
Missile
China Ship
Visakhapatnam
India

More Telugu News