Nara Lokesh: కరవు జిల్లాకు కార్లు పండే కియాను తెచ్చాం: లోకేశ్

  • దేశంలో కియా కారు ఎక్కడ కనిపించినా గుర్తొచ్చేది అనంతపురమే
  • పుణ్యభూమి, మంచి మనుషులున్న పవర్ ఫుల్ నేల ఇది
  • బిల్డప్ బాబాయి జగన్ సిద్ధం సభలో డ్రోన్ ను చూసి భయపడ్డాడు
  • టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చూసి జగన్ లో భయం మొదలైంది
  • రుద్రంపేట శంఖారావం సభలో నారా లోకేశ్ ప్రసంగం
Nara Lokesh Shankaravam Sabha Speech At Rudrampet

దేశంలో కియా కారు ఎక్కడ కనిపించినా అనంతపురం జిల్లానే గుర్తుకు వస్తుందని, కరవు జిల్లాకు కార్లు పండే కియాను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఉపాధి లేక వలసపోతున్న యువత కోసం కియా కంపెనీ తీసుకొచ్చి 50 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మార్చి, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పించి అనంతను అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని వివరించారు. వీరభద్ర ఆలయం, ప్రశాంతి ఆలయం, చెన్నకేశవస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా.. అన్న ఎన్టీఆర్ గారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన జిల్లా.. ఇలాంటి పవిత్రమైన నేలపై మరోసారి మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేల చాలా పవర్ ఫుల్ అని, మంచి చేస్తే గుండెల్లో పెట్టుకునే మంచి మనసులు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో అన్యాయం చేసిన వారి తోలుతీసే శక్తి కూడా అనంత ప్రజలకు ఉందన్నారు. అనుకున్నది సాధించే మొండితనం ఇక్కడి వారిలో కనిపించే సహజ గుణమని కొనియాడారు. 

బిల్డప్ బాబాయి..
ఎవరైనా పులిని చూసి భయపడతారు.. మన బిల్డప్ బాబాయి జగన్ మాత్రం సిద్ధం సభలో డ్రోన్ ను చూసి భయపడ్డాడని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. సభకు రారనే విషయం ముందే తెలుసు కాబట్టి గ్రాఫిక్స్ కు వీలుగా గ్రీన్ మ్యాట్ వేశారని ఆరోపించారు. తనను బండబూతులు తిట్టిన అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ ను సూటిగా అడుగుతున్నా.. డ్రోన్ ను చూసి పిల్లుల్లా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బాహుబలి చూపిస్తానని చెప్పి పులకేశి సినిమా చూపించారని అన్నారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలోనూ జగన్ తన బిల్డప్ చూపించారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్రా, జీవక్రాంతి, చేదోడు గురించి ప్రశ్నలు అడిగారని గుర్తుచేశారు. ఈ ప్రశ్నలకు బదులుగా బాబాయిని లేపేసింది ఎవరు, వారంలో సీపీఎస్ ను రద్దు చేస్తానన్నది ఎవరు, మహిళల పేరుపై 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పి మాట తప్పింది ఎవరని ప్రశ్నిస్తే అందరూ సరైన సమాధానాలే రాసేవారని లోకేశ్ అన్నారు. ఖాళీ కుర్చీలను డ్రోన్ తో వీడియో తీస్తున్నారని వైసీపీ నేతలే చెప్పారని లోకేశ్ గుర్తుచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చూసి జగన్ భయపడుతున్నాడని, ఆయన ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

క్రిమినల్ రికార్డులు ఉన్నంతకాలం..
చరిత్ర ఉన్నంత వరకు కాదు క్రిమినల్ రికార్డులు ఉన్నంత కాలం జగన్ ఉంటాడని లోకేశ్ అన్నారు. చంచల్ గూడ జైలులో కూడా జగన్ పేరు ఉంటుందన్నారు. జగన్ పై నమోదైన కేసులకు సంబంధించి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో కేస్ స్టడీ ఉందని లోకేశ్ చెప్పారు. ఇలాంటి వారిని ఎలా ఎన్నుకుంటున్నారో అని విదేశాల్లో చర్చించుకుంటున్నారని అన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటానని చెప్పే జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏడాదికి 6500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఏమైందని నిలదీశారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీ ఏమైందని అడిగారు. ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు హామీలు అమలుచేస్తే చిత్తశుద్ధని, చివరి ఆరు నెలల్లో చేస్తే మోసం అని ఆయనే అన్నారు. మరి ఇప్పుడు ఎన్నికల ముందు గ్రూప్-2 నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఏమంటారని లోకేశ్ ప్రశ్నించారు.

తమ ప్రభుత్వంలో ఏటా డీఎస్సీ..
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. ఉద్యోగం వచ్చే వరకు నెలనెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సర్కారు పెండింగ్ లో పెట్టిన పోస్టులను భర్తీచేస్తామని తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను దగ్గరి నుంచి చూశానని లోకేశ్ వివరించారు. వాటి పరిష్కారం కోసమే చంద్రబాబు సూపర్ 6 హామీలు ప్రకటించారని చెప్పారు. స్కూలుకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటా డబ్బులను వారి ఖాతాలోనే జమ చేస్తామని, ఒక్కరు ఉంటే రూ.15 వేలు, ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ఏటా అందజేస్తామని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేలు, మహిళలకు ఏటా రూ. 18 వేలు అందిస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇంటింటికీ ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని వివరించారు.

ముస్లిం సోదరులు ఆలోచించాలి..
టీడీపీ సర్కారు ఐదేళ్ల పాలనలో ఏనాడూ మైనారిటీలపై దాడులు జరగలేదనే విషయం గుర్తుచేస్తూ.. ముస్లిం సోదరులు ఆలోచించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చామని చెప్పారు. రంజాన్ మాసంలో తోఫా.. మసీదులకు రంగులు వేసేందుకు డబ్బులు, ఇమామ్, మౌజాన్ లకు గౌరవ వేతనం, దుల్హన్ పథకం.. తదితర స్కీములను గుర్తుచేశారు. జగన్ వచ్చిన తర్వాత మైనారిటీలపై దాడులు పెరిగాయని, ఏకంగా వీడియో పెట్టి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని లోకేశ్ చెప్పారు. పలమనేరులో వైసీపీ నేతల వేధింపులతో ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్న యువతి మిస్బా, మైనారిటీల భూములు అన్యాక్రాంతం కాకుండా పోరాడినందుకు నర్సరావుపేటలో ఇబ్రహీంను నడివీధిలో చంపేశారని లోకేశ్ ఆరోపించారు. జగన్ మాయ మాటలు నమ్మొద్దని, మైనారిటీలకు ఎప్పుడూ అండగా ఉండేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, ముగ్గురు మైనారిటీలను రాజ్యసభకు పంపించిన ఘనత పార్టీకి ఉందని చెప్పారు.

ఏపీకి ఐపీఎల్ టీం పెడతాడట.. 
ఆంధ్రప్రదేశ్ కు ఐపీఎల్ టీం పెడతానన్న జగన్ మాటలను ప్రస్తావిస్తూ.. ఐపీఎల్ టీం సరే, దానికి ఏం పేరు పెడతారంటూ లోకేశ్ ప్రశ్నించారు. కోడికత్తి వారియర్స్ అని పెడతారా.. అని విమర్శించారు. బాబాయిని గట్టిగా కొట్టిన అవినాశ్ రెడ్డి ఈ టీంలో సీనియర్ బ్యాట్స్ మెన్ అని, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్ ను ఈ జట్టులో చేర్చండంటూ ఎద్దేవా చేశారు. యూట్యూబ్ స్టార్ భరత్, బూతుల స్టార్  సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని, పింఛ్ హిట్టర్ బియ్యను మధుసూదన్ కూడా చేర్చితే ఇంకా బాగుంటుందన్నారు.

కటింగ్, ఫిటింగ్ మాస్టర్..
జగన్ ను చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తుకువస్తాడని లోకేశ్ చెప్పారు. బల్లపైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేస్తాడని, బల్ల కిందున్న రెడ్ బటన్ నొక్కి ఖాతాలో నుంచి రూ.100 లాగేస్తాడని ఆరోపించారు. కరెంట్ ఛార్జీలను 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలను మూడుసార్లు, ఇంటి పన్ను, చెత్తపన్నులను పెంచి ప్రజలను బాదుడే బాదుడని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి, క్వార్టర్ బాటిల్ ధర, నిత్యావసరాల ధరలు పెంచి బాదుతున్నాడని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని అన్న క్యాంటీన్ కట్, పెళ్లికానుకలు కట్, పండుగ కానుకలు, చంద్రన్న బీమా కట్, స్కూల్ ఫీజురీయింబర్స్ మెంట్, రాష్ట్రంలోని 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ కట్ చేశాడని విమర్శించారు. దేశంలోనే 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

ప్రిజనరీకి, విజనరీకి తేడా చూడండి..
రైతులకు పెద్దఎత్తున డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసిన ఘనత విజనరీ లీడర్ చంద్రబాబుదని లోకేశ్ పేర్కొన్నారు. వర్షాలు పడకపోతే ఒకే ఏడాది రూ.2 వేల కోట్లు ఇన్ పుట్ సబ్సీడీ చెల్లించి రైతులను ఆదుకున్నట్లు తెలిపారు. ముందుచూపుతో 600 ఎకరాల భూమి సేకరించి రెండేళ్లలోనే కియా కంపెనీని చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చాడని చెప్పారు. ప్రిజనరీ జగన్ మాత్రం లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు, సైన్స్ సిటీ పేరుతో 8వేల ఎకరాలు భూసేకరణ చేసి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదని ఆరోపించారు. దాదాపు 17 వేల ఎకరాల భూములు ప్రస్తుతం జగన్ సొంత మిత్రుల కంపెనీల చేతుల్లో ఉన్నాయని అన్నారు. విజనరీకి, ప్రిజనరీకి తేడా ఇదేనని లోకేశ్ వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆ 17 వేల ఎకరాల భూములు వెనక్కి తీసుకుని స్థానికులకే ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ఇస్తామని లోకేశ్ ఈ సందర్భంగా అనంత ప్రజలకు మాటిచ్చారు. 

మేం చేసిన అభివృద్ధినీ పాడు చేశారు..
టీడీపీ హయాంలో అనంతపురం పట్టణానికి ఏకంగా 91 కోట్లతో పైప్ లైన్లు, 11 రిజర్వాయర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని లోకేశ్ గుర్తుచేశారు. అప్పుడు కట్టిన రిజర్వాయర్లు, పైప్ లైన్లను కూడా సరిగా వినియోగించుకోలేక పాడుబెట్టిన చేతగాని ప్రభుత్వం అంటూ జగన్ సర్కారుపై మండిపడ్డారు. టీడీపీ పాలనలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తే, ఆ ఆసుపత్రికి కనీసం డాకర్లను కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్ సర్కారు ఉందని విమర్శించారు. 

అవినీతిపరులను తరిమి కొట్టండి..
అనంత వెంకట్రామిరెడ్డి అవినీతి పరుడని, చేతగాని కమీషన్ ఎమ్మెల్యే అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని లోకేశ్ అన్నారు. ఇక, పాపాల పెద్దిరెడ్డిది మరో చరిత్ర అని, చిత్తూరు జిల్లాను అడ్డగోలుగా దోచాడని ఆరోపించారు. ఇప్పుడు అనంతను దోచుకునేందుకు ఇక్కడకు వచ్చాడని, ఆ పాపాల పెద్దిరెడ్డిని  తరిమితరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు అండగా ఉన్నారని లోకేశ్ మెచ్చుకున్నారు. సొంత అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు లేని తనకు ఎన్టీఆర్ ఏకంగా 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారని చెప్పారు. కార్యకర్తలు తన కుటుంబమని, వారికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

పనిచేసే కార్యకర్తలకే పదవులు..
బాగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు. పార్టీలో అందరినీ సమానంగా గౌరవిస్తానని, పనిచేసే వాళ్లను పదవులు కట్టబెట్టి ప్రోత్సహిస్తానని లోకేశ్ పేర్కొన్నారు. తనపై, చంద్రబాబుపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా సరే తగ్గేదేలేదని ఎప్పుడో చెప్పానని లోకేశ్ పేర్కొన్నారు. చేయని నేరానికి చంద్రబాబును జైలుకు పంపితే తనకు మొదట ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని గుర్తుచేసుకున్నారు. టీడీపీ-జనసేన కలిసికట్టుగా పోరాడాలని, మన మధ్య చిచ్చు పెట్టాలని వైసీఎం పేటియం బ్యాచ్ చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సైకో పోవాలి-సైకిల్ రావాలనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు.

More Telugu News