Yogi Deep Fake: డయాబెటిక్ మందుకు యూపీ సీఎం ప్రచారం.. డీప్ ఫేక్ వీడియో..!

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
  • ఇటీవల కోహ్లీ, టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోలు
CM Yogi adityanath deep fake video

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ డయాబెటిక్ మందును కొనుగోలు చేయాలని చెబుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డీప్ ఫేక్ టెక్నాలజీతో ఈ వీడియోను సృష్టించారని, గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని యూపీ పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ నకిలీ మందులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని చెప్పారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఓ న్యూస్ ఛానల్ క్లిప్ లో యూపీ సీఎం యోగి మాట్లాడుతున్నట్లు, మధుమేహ బాధితుల కోసం తయారుచేసిన మందును కొనుగోలు చేయాలని సూచిస్తున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఈ వీడియోను రూపొందించారు. హజ్రత్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదుతో సైబర్‌ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న మార్ఫింగ్‌ వీడియోలపై సెలబ్రెటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్నా, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

రష్మిక మందన్నాను అసభ్యంగా చూపిస్తున్న వీడియోతో పాటు బెట్టింగ్, గేమింగ్ యాప్ లకు కోహ్లీ, టెండూల్కర్ ప్రచారం చేస్తున్నట్లు వీడియోలు తయారుచేశారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ.. తప్పుడు, ఫేక్ వీడియోలను గుర్తించిన వెంటనే ప్రచారంలో నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియా సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు. ఫేక్ వీడియోల కట్టడికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

More Telugu News