No Look Run out: వెనక్కి చూడకుండా వికెట్లు గిరాటేసిన బంగ్లా వికెట్ కీపర్.. ధోనీని దింపేశాడుగా..!

  • శ్రీలంకతో టీ 20 మ్యాచ్ లో అద్భుతమైన రనౌట్
  • ఫీల్డర్ విసిరిన బంతిని అదే వేగంతో వికెట్ల వైపు త్రో..
  • రెప్పపాటులో ఎగిరిపడ్డ స్టంప్స్.. లిట్టన్ ఎంఎస్ దాస్ అంటున్న ఫ్యాన్స్
Bangladesh Star Player No Look Run Out Has Internet In Awe

బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ చేసిన రనౌట్ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని గుర్తుచేస్తోంది. వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని డైవ్ చేస్తూ అందుకున్న దాస్.. అదే వేగంతో బంతిని వికెట్ల వైపు విసిరాడు. వెనక్కి తిరిగి చూడకుండా దాస్ విసిరిన బంతి నేరుగా వికెట్లకు తాకి స్టంప్స్ ను గిరాటేసింది. ఈ రనౌట్ చూసిన వారికి ఎంఎస్ ధోనీ గతంలో ఇలాంటి స్టన్నింగ్ రనౌట్లు గుర్తుచేసుకున్నారు. లిట్టన్ దాస్ కాదు.. లిట్టన్ ఎంఎస్ దాస్ అంటూ బంగ్లా వికెట్ కీపర్ ను పొగుడుతున్నారు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచులు ఆడనుంది. శనివారం సిల్హాట్ లో ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును శ్రీలంక ఓడించింది. అయితే, మ్యాచ్ లో మెయిడిన్ ఓవర్ వేసి హ్యాట్రిక్ వికెట్ తీసిన శ్రీలంక బౌలర్ నువాన్ తుషారతో పాటు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ అద్భుతమైన రనౌట్ ప్రేక్షకులను అలరించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 174 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించిన దసున్ షనాకాను దాస్ కళ్లు చెదిరే వేగంతో రనౌట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. కాగా, ఈ మ్యాచ్ లో 146 పరుగులకే ఆలౌట్ అయి బంగ్లా జట్టు ఓటమి పాలయింది.

More Telugu News