Atchannaidu: మేదరమెట్లలోనూ జగన్ అబద్ధాల విషపు జల్లు కురిపించారు: అచ్చెన్నాయుడు

Atchannaidu counters CM Jagan claims in Medarametla Siddham meeting
  • మేదరమెట్లలో నేడు వైసీపీ సిద్ధం సభ
  • గత టీడీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ విమర్శలు
  • తాము 99 శాతం హామీలు నెరవేర్చామని వెల్లడి
  • జగన్ 85 శాతం హామీలు అమలు చేయలేదన్న అచ్చెన్నాయుడు
మేదరమెట్ల 'సిద్ధం' సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చామని సీఎం జగన్ చెప్పడాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. మేదరమెట్లలోనూ జగన్ అబద్ధాల విషపు జల్లు కురిపించారని మండిపడ్డారు. హామీలు నిలబెట్టుకున్నానన్న జగన్ మాట పచ్చి అబద్ధం అని అన్నారు. 85 శాతం హామీలు అమలు చేయకుండా మాట తప్పాడని విమర్శించారు. తన మోసాల్ని టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ నైజం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

సంక్షేమానికి బడ్జెట్ లో జగన్ 15% ఖర్చు చేయగా.. చంద్రబాబు 19% ఖర్చు చేశారు అని వెల్లడించారు. బాబాయి గొడ్డలివేటు పాపంతో పులివెందులలో ఎలా గెలుస్తావో చూసుకో అని హెచ్చరించారు.  

జగన్ కల రూ.10 లక్షల కోట్ల దోపిడీ... జిల్లాకొక సొంత ప్యాలెస్ నిర్మాణం అని ఆరోపించారు. ప్రజా విశ్వాసం కోల్పోయినందునే నేడు మేదరమెట్ల సభకు నిండా లక్ష మంది కూడా రాలేదని అన్నారు.

1. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్... మాట తప్పి మడమ తిప్పాడు. ఓటు అడిగే హక్కు కోల్పోయాడు. నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశాడు. నాసిరకం మద్యం వల్ల కిడ్నీ, లివర్ చెడిపోయి 30,000 మంది ప్రాణాలు పోయి, వారి భార్యల మాంగల్యాలు మంట కలిశాయి. నాసిరకం మద్యంలో జగన్ లక్ష కోట్లు కమీషన్ కొట్టేశాడు. అందుకే డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు.
2. జగన్ 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పాడు.
3. అధికారంలోకి వచ్చిన వారంలో.. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పాడు.
4. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా రూ.1000 పెంచుతానని హామీ ఇచ్చి మాట తప్పాడు.

5. విద్యుత్ చార్జీలు పెంచనన్న హామీకి విరుద్ధంగా 9 సార్లు పెంచి... రూ.64 వేల కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజలపై మోపి మాట తప్పాడు.
6. ఇసుక సరఫరాపై మాట తప్పాడు. ఉచిత ఇసుకను రద్దు చేసి రూ.50 వేల కోట్ల కుంభకోణం చేశాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టాడు.
7. ఇద్దరు బిడ్డలకు అమ్మ ఒడి హామీపై మాట తప్పాడు. అమ్మ ఒడికి రూ.13,000 ఇచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేస్తున్నాడు. ఇలా నవరత్నాలను నవమోసాలు చేశాడు. చంద్రబాబు 16 లక్షల మందికి  ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వగా... దాన్ని జగన్ 9 లక్షలకే కుదించి 7 లక్షల మంది విద్యార్థులకు నష్టం చేశాడు.

8. రైతు భరోసా హామీపై మాట తప్పాడు. రాష్ట్ర నిధుల నుండి రూ.7,500 మాత్రమే ఇస్తున్నాడు. కేంద్రం ఇచ్చే రూ.6,000 తానే ఇచ్చినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడు. పైగా ఒక్కో రైతుకు లక్ష రూపాయలు లబ్ధి చేకూర్చిన రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశాడు.
9. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానన్న హామీపై మాట తప్పాడు. పైగా పెట్రోల్ రేట్లలో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది.
10. జగన్ 25 లక్షల పక్కా ఇళ్లు ఉచితంగా నిర్మిస్తానన్న హామీపై మాట తప్పాడు. ఇంటి నిర్మాణాల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశాడు. సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్లు కుంభకోణం చేశాడు.

ఇలా 85% హామీలు అమలు చేయకుండా మాట తప్పాడు. మడమతిప్పాడు. 99% హామీలు అమలు చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. పంచాయతీలు, మున్సిపాల్టీలకు కేంద్రం పంపిన 12వేల కోట్ల నిధులను జగన్ దారి మళ్లించి స్థానిక సంస్థల్ని నాశనం చేశాడు.

11. ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒకే కుటుంబంపై రూ. 8లక్షల భారం మోపాడు. ఇచ్చేది గోరంత, కొట్టేసేది కొండంత.
12. అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ లాంటి 120 చంద్రన్న సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. 
13. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు ఒక లక్ష కోట్లు దారి మళ్ళించాడు.
14. వైసీపీ మూకలు 14 లక్షల అసైన్ మెంట్ భూములను  కబ్జా చేశాయి.
15. ప్రశ్నించిన దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన 1000 మందిని హత్యలు చేశారు.

16. జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి. నేర పాలనలో ఐదు కోట్ల మంది బాధితులే. 
17. బాధితులందరూ ఏకమయ్యారు. ప్రజా ఆకాంక్ష మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటై నియంత దోపిడీని అంతం చేస్తాయని జగన్ భయపడుతున్నాడు.
18. జగన్ కు ప్రజాబలం ఉంటే ప్రతిపక్షాల ఐక్యతను చూసి ఎందుకు భయపడుతున్నారు?
19. ప్రతిపక్షాల ఐక్యతతో జగన్ ఎన్నికల అక్రమాలు సాగవని ప్యాంట్లు తడుపుకుంటున్నారు. తన చుట్టూ ఉన్న వేలాదిమంది మాఫియాల ఆటలు సాగవని బెంబేలెత్తుతున్నాడు.
20. ప్రజల్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి మేదరమెట్లకు 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వంద కోట్లు ఖర్చు చేసి జనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయినా సభ వెలవెలబోయింది. అందుకే మీడియాపై ఆంక్షలు పెట్టారు. జగన్ ది వాపే గానీ బలం కాదని తేలిపోయింది.  

Atchannaidu
Jagan
Siddham
Medarametla
TDP
YSRCP

More Telugu News