Praneet Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రణీత్‌ రావుపై కేసు నమోదు

  • స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి అదనపు ఎస్పీ డి.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
  • ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపైనా కేసులు నమోదు
  • కేసు నమోదు కావడంతో ప్రణీత్‌ రావుని పోలీసులు విచారించే అవకాశాలు
case has been registered against Praneet Rao in the phone tapping case

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి) అదనపు ఎస్పీ డి.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. సమాచారాన్ని వ్యక్తిగత పరికరాల్లోకి కాపీ చేసుకున్నాక హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ హయాంలో ఎస్‌ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావుతో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. 

ఇటీవల కొన్ని రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు డిసెంబర్‌ 4న రాత్రి సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆఫ్‌ చేసి డేటాను ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలలోని సమాచారం, ఇతర డాక్యుమెంట్లు మాయమవ్వడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో అసలేం జరిగిందో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదవడంతో ప్రణీత్‌రావును విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ఎస్‌ఐబీ కార్యాలయంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 గదుల్లోని 17 కంప్యూటర్లను ప్రణీత్‌రావు అనధికారికంగా వాడుకున్నారు. ప్రత్యేకంగా ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, రికార్డు ధ్వంసం ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే ప్రణీత్ రావుని డీజీపీ రవిగుప్తా సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ప్రణీత్‌ను డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వం అటాచ్ చేసింది. విచారణ తర్వాత సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News