Nara Lokesh: జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం: నారా లోకేశ్

  • వైసీపీ సర్కారుపై మరోసారి మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
  • జగన్‌ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించిన యువనేత
  • అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ‘ఎక్స్’లో ఫొటో షేర్ చేసిన నారా లోకేశ్
Life of the RayalaSeema people is ruined under Jagan Govts rule says Nara Lokesh

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రమైపోయిందని, జగన్‌ది దరిద్ర పాదమని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడుబారిన పొలాలు, గతుకుల రోడ్లను చూపిస్తూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేసి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితులు చూసి చలించిపోయానని ఆయన అన్నారు. ప్రజల కష్టాలను గాలికొదిలేసి ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌ల పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్న సీఎం జగన్ రాయలసీమ బిడ్డ కాదని, ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో పట్టుమని పదెకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడు జగన్ అని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లక్షలాది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమేగాక కరువుసీమలో కార్లపంట పండించిన అపర భగీరథుడు చంద్రన్న అని అన్నారు. గజదొంగ జగన్ కావాలో, విజనరీ లీడర్ చంద్రబాబు కావాలో తేల్చుకోవాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలేనని ఆయన పేర్కొన్నారు.

More Telugu News