Chandrababu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు
  • బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉందని ఆరోపణ
  • బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముందని ప్రశ్నించిన వైఎస్ షర్మిల
Chandrababu and Pawan Kalyan should answer to AP people says YS Sharmila

కేంద్రంలోని అధికార బీజేపీతో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీకి బానిసగా బతకాల్సిన ఖర్మ ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే హామీతో  జగనన్న అధికారంలోకి వచ్చారని, కానీ మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ విడుదల చేశారని మండిపడ్డారు. బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముందని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉందని, బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారని ఆరోపించారు.  'సిద్ధం' సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారని అన్నారు. 

జనాలను పోగేసుకుని మళ్లీ మాయ చేస్తున్నారని, బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో విడుదల చేసిందని, 'భర్తీ భరోసా' పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ యువత, నిరుద్యోగ సమస్యలపై స్పందించి ఈ మ్యానిఫెస్టో రూపొందించారని షర్మిల చెప్పారు.

More Telugu News