Siddham: సింగిల్ గా వస్తే చితకబాదుతాం: మంత్రి అంబటి

YCP Leaders talks about three parties alliance
  • సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు అంటూ అంబటి వ్యాఖ్యలు
  • ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని స్పష్టీకరణ
  • జగన్ పాలనలో ప్రతి ఇంటికీ మేలు జరిగిందన్న చెవిరెడ్డి
  • 175కి 175 స్థానాలు గెలుస్తామన్న కాకాణి
  • జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులు పెట్టుకున్నారన్న అనిల్ కుమార్
మేదరమెట్ల సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగించారు. సీఎం జగన్ మొనగాడు... చంద్రబాబు మోసగాడు అని వ్యాఖ్యానించారు. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని పేర్కొన్నారు. సింగిల్ గా వస్తే చితకబాదుతాం... ఇద్దరూ కలిసి వస్తే విసిరికొడతాం... ముగ్గురుగా వస్తే సముద్రంలో కలిపేస్తాం అని అంబటి సమరోత్సాహం ప్రదర్శించారు. 

ఒంగోలు వైసీపీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటే ఒక నమ్మకం అని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన చేశాడని కొనియాడారు. సీఎం జగన్ పాలనలో ప్రతి ఇంటికీ మేలు జరిగిందని తెలిపారు. 

ఇక, చంద్రబాబు పచ్చి మోసగాడు అని మంత్రి కాకాణి గోవవర్ధన్ రెడ్డి విమర్శించారు. గతంలో రైతులను, అక్కచెల్లెమ్మలను మోసం చేశాడని, కానీ సీఎం జగన్ తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని తెలిపారు. రాష్ట్రంలో 175కి 175 స్థానాలు గెలిచి తీరుతామని కాకాణి స్పష్టం చేశారు. 

సీఎం జగన్ కు ప్రజల అండదండలు ఉన్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా జగనే మరోసారి సీఎం అని స్పష్టం చేశారు.
Siddham
Medarametla
YS Jagan
YSRCP
Chandrababu
TDP
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News