Trinamool Congress: లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. టికెట్ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్

  • పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ
  • తృణమూల్ కాంగ్రెస్ జాబితాలో మాజీ క్రికెటర్ పేరు
  • కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బహరంపూర్.. ఇక్కడి నుంచి ఐదుసార్లు గెలిచిన అధీర్ రంజన్ చౌదరి
Trinamool Congress gave ticket to former cricketer Yusuf Pathan in Lok Sabha elections

టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో యూసుఫ్ పఠాన్ పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బహరంపూర్ నియోజకవర్గం బరిలో నిలవనున్నాడు. లోక్‌సభ విపక్షనేతగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ అధిర్ రంజన్ చౌదరి మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో గెలుపొందిన ఆయన మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టుగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమైన నేపథ్యంలో పదేపదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరిపై తృణమూల్ కాంగ్రెస్‌ ప్రముఖ వ్యక్తి యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దింపడం గమనార్హం. మరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూసుఫ్ పఠాన్ అదృష్టం ఎలా ఉండబోతోందో వేచూడాల్సిందే.

కాగా మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 స్థానాలు ఉండగా అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో పొత్తు లేదని అధికారికంగా పార్టీ వెల్లడించింది. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విపక్షాల ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కోరుతోందని, ఈ పొత్తు తమకు అక్కర్లేదని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.

More Telugu News