YSRCP: ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు: వైఎస్ షర్మిల ఆరోపణ

Rs 90 crores spent on each Siddham meeting by YSRCP says YS Sharmila
  • ‘సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు
  • ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్నారని మండిపాటు
  • విజయవాడలోని ఆంధ్రరత్నా భవన్‌లో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల
అధికార వైఎస్సార్‌సీపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శల దాడికి దిగారు. ఏకంగా రూ.600 కోట్లతో ‘సిద్ధం’ సభలను నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక్కో ‘సిద్ధం’ సభకు రూ.90 కోట్లు వైసీపీ వెచ్చిస్తోందని షర్మిల అన్నారు. ‘సిద్ధం’ సభల పేరిట ప్రభుత్వ ఆదాయాన్ని వైసీపీ దోచుకుంటోందని మండిపడ్డారు. ఇదంతా ఎవరి సొమ్ము అని ఆమె ప్రశ్నించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ‘ఆంధ్రరత్నా భవన్‌’లో ఆమె మీడియాతో మాట్లాడారు.

ఇక తాను ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేదానిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిందని షర్మిల చెప్పారు. అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ఆమె వెల్లడించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు రావాలని ఆమె ప్రస్తావించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆమె ధ్వజమెత్తారు. గత ఎన్నికల ప్రచారంలో 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని, ఆ వాగ్దానం ఏమైందని షర్మిల ప్రశ్నించారు. కావాల్సిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇచ్చారని, ఉద్యోగాలపై తాము నిలదీస్తే తీవ్రవాదుల్లా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. గృహనిర్బంధాలు, అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
YSRCP
YS Sharmila
Congress
Andhra Pradesh
AP Politics

More Telugu News