Arvind Kejriwal: మీ భర్తలు మోదీ పేరెత్తితే ఆ రాత్రి వారికి భోజనం పెట్టొద్దు.. మహిళలకు ఢిల్లీ సీఎం సూచన

If husband chants Modi dont serve dinner Kejriwal appeals to women voters
  • శనివారం ఢిల్లీలో మహిళా సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగం
  • తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతో చేసిందన్న ఢిల్లీ సీఎం
  • మహిళలు తమ కుటుంబసభ్యులతో ఆప్‌కు ఓటేయించాలని విజ్ఞప్తి
మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం ఎంతో చేసిందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. మహిళలందరూ తమ కుటుంబసభ్యులతో ఆప్‌కు ఓటేయించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలో మహిళా సమ్మాన్ సమారోహ్ పేరిట జరిగిన టౌన్‌హాల్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

‘‘అనేక మంది పురుషులు ఈ మధ్య మోదీ పేరు జపిస్తున్నారు. ఈ పరిస్థితిని మీరే (మహిళలు) చక్కదిద్దాలి. మీ భర్తలు మోదీ పేరెత్తితే వారికి రాత్రి భోజనం పెట్టొద్దు. కుటుంబ సభ్యులు ఆప్‌కు ఓటేసేలా మీ మీద వారితో ఒట్టు వేయించుకోండి. బీజేపీకి మద్దతు ఇస్తున్న మహిళలకు మీ సోదరుడు కేజ్రీవాల్ గురించి చెప్పండి. నేను వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటానని వివరించండి’’ అని మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. 

‘‘నేను ఉచిత విద్యుత్, ఉచిత బస్ టిక్కెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయండి. ఇప్పుడు నేను 18 ఏళ్లు పైబడ్డ మహిళలందరికీ నెలనెలా రూ. 1000 ఇస్తున్నాను. మరి బీజేపీ మహిళలకు ఏం చేసింది? బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ఆయన ప్రశ్నించారు. 

మహిళా సాధికారత పేరిట దేశంలో మోసాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఈ పార్టీలు ఏదొక మహిళకు ఓ పోస్టు ఇచ్చి మహిళలందరూ సాధికారత సాధించారని చెప్పుకుంటున్నాయి. మహిళలకు అధికారం వద్దని నేను అనట్లేదు. వాళ్లకు పెద్ద పోస్టులు, టిక్కెట్స్ రావాల్సిందే. వాళ్లకు అన్నీ అందాలి. అయితే, ఇద్దరో నలుగురో మహిళలు ఈ ప్రయోజనాలు పొందితే మిగతా వారి పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. తమ కొత్త పథకం ‘ముఖ్యమంత్రి మహిళా యోజన సమ్మాన్‌’తోనే మహిళలకు నిజమైన సాధికారత వస్తుందని అన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమమని చెప్పారు.
Arvind Kejriwal
New Delhi
Lok Sabha Polls
BJP
Narendra Modi
AAP

More Telugu News