Sec-Vizag VandeBharat: తెలుగు ప్రజల కోసం త్వరలో మరో వందేభారత్ రైలు!

  • సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే బోర్డు ఆమోదం
  • సికింద్రాబాద్‌లో ఉదయం 5 గంటలకు, వైజాగ్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు రైలు ప్రారంభం
  • ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రెండో సర్వీసుకు ఆమోదం
Second Vandebharat express between secunderabad Vizag to be launched soon

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో గుడ్ న్యూస్. ఏపీ, తెలంగాణల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం  నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట మీదుగా ఈ రైలును నడపనున్నారు. 

ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య తొలి వందేభారత్ గతేడాది జనవరి 15న పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ రైలుకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉండటంతో వంద శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. చాలా సందర్భాల్లో రిజర్వేషన్ దొరక్కపోవడంతో పాటూ రానుపోను ఒకే రైలు ఉండటంతో తరచూ సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగా అధికారులు రెండో వందేభారత్‌ను అందుబాటులోకి తేనున్నారు. 

ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్‌లో 16 బోగీలు ఉండగా, సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్‌లో మాత్రం 8 బోగీలే ఉన్నాయి. రైళ్లను ఎక్కువ స్టేషన్లలో ఆగేందుకు వీలుగా రైల్వే బోర్డు బోగీల సంఖ్యను పరిమితం చేస్తోంది.

More Telugu News