Chilakaluripet: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభ కోసం చిలకలూరిపేట వద్ద స్థలం పరిశీలన

  • బీజేపీతో టీడీపీ, జనసేనలకు కుదిరిన పొత్తు
  • టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్డీయేలోకి స్వాగతం పలికిన బీజేపీ పెద్దలు
  • ఈ నెల 17 లేదా 18న ఏపీలో మూడు పార్టీల భారీ బహిరంగ సభ
  • బొప్పూడి వద్ద 150 ఎకరాల స్థలం పరిశీలించిన టీడీపీ-జనసేన నేతలు
Three parties will be held meeting at Chilakaluripet

రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ చేయి కలిపిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల చర్చలు ఫలించి పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో, మూడు పార్టీలు ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 

ఈ నెల 17 లేదా 18న జరిగే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ-జనసేన నేతలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు. బొప్పూడి వద్ద 150 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తించారు. 

ఈ బృందంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీయే కూటమిలో చేరాక నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ ఇదేనని వెల్లడించారు. ఈ సభకు 10 లక్షల నుంచి 15 లక్షల మంది హాజరవుతారన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. 

అందుకే అన్ని విధాలా అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు చిలకలూరిపేటను ఎంపిక చేశారని ప్రత్తిపాటి వివరించారు. రేపటి నుంచే ఇక్కడి రైతులతో మాట్లాడి సభకు ఏర్పాట్లు మొదలుపెడతామని వెల్లడించారు. 

ఇది దేశం మొత్తానికి ఒక సందేశం ఇచ్చే సభ అని వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరినప్పటి నుంచే వైసీపీకి వణుకుపుడుతోందని అన్నారు. మూడు పార్టీల ఐక్యతను చెడగొట్టే  దురుద్దేశం వారిలో కనిపిస్తోందని, వైసీపీకి అభ్యర్థులు కూడా దొరక్కుండా జారుకునే పరిస్థితి ఏర్పడబోతోందని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. 

అంతేకాదు, వైసీపీ వాళ్లు అద్దంకిలో నిర్వహించే సిద్ధం సభను, చిలకలూరిపేటలో తాము నిర్వహించబోయే సభను రాష్ట్ర ప్రజలు పోల్చి చూసుకునే స్థాయిలో తమ సభ ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

వైసీపీ ఎన్ని దురాలోచనలు చేసినా, రాష్ట్ర శ్రేయస్సు కోసం మూడు పార్టీల కలయిక తప్పనిసరైందని స్పష్టం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించబోయే ఈ సభ చరిత్రలో లిఖించబడుతుందని అన్నారు.

More Telugu News